Telugu Gateway
Andhra Pradesh

షాక్ లో తెలుగుదేశం

షాక్ లో తెలుగుదేశం
X

తెలుగుదేశం పార్టీ ఒక్కసారిగా షాక్ కు గురైంది. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ప్రకటనతో ఒక్కసారిగా ఆ పార్టీ నేతల మైండ్ బ్లాంక్ అయినంత పనైంది. ఎందుకంటే మంత్రులు కూడా ‘అదుపు తప్పి’ మాట్లాడిన మాటలు చూస్తుంటే ఎవరైనా నివ్వెర పోవాల్సిందే. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడానికి..ప్రత్యేక హోదాకు సంబంధం ఏంటి?. జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే ప్రత్యేక హోదా రాదా?. అసలు ఆ పార్టీ నేతలు సంబంధం లేని వ్యాఖ్యలు చేసి ప్రజలను మరింత గందరగోళానికి గురిచేస్తున్నారు. పాదయాత్ర నిమ్మకూరు చేరిన సందర్భంగా జగన్ తాను అధికారంలోకి వస్తే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరుపెడతామని ప్రకటించారు. దీంతో తెలుగుదేశం నేతలు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. మంత్రి అచ్చెన్నాయుడు అయితే తాను మంత్రిని అనే సంగతి మర్చిపోయి...అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. ‘ నాలుగేళ్ళు ఏం పీకావు. బుద్ధి జ్ణానం ఉందా?. నీకు ఎన్టీఆర్ పై అంత ప్రేమ ఉంటే అసెంబ్లీ లో ఈ విషయం ఎందుకు మాట్లాడలేదు. ప్రత్యేక హోదా ఉద్యమం ఉధృతంగా సాగుతుంటే డైవర్ట్ చేయటానికే ఇలా చేస్తున్నారు’ అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

కొల్లు రవీంద్ర జగన్ ప్రకటనను స్వాగతిస్తూనే ఆయన కూడా ప్రత్యేక హోదా ఉద్యమానికి ఈ ప్రకటనకు లింక్ పెట్టారు. అదే సమయంలో జిల్లా ప్రజలు ఎప్పటి నుంచో ఇదే కోరుతున్నారని....ప్రభుత్వం పరిశీలనలో ఉందని అన్నారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు, మంత్రి కళా వెంకట్రావు అయితే ఓ అడుగు ముందుకేసి వైఎస్ ఆర్ కొడుకు ఎన్టీఆర్ పేరు పెడతారా? అని ప్రశ్నించారు. జగన్ కు ఎన్టీఆర్ పేరెత్తే అర్హత లేదన్నారు. మరి ఖర్జూరనాయుడి కొడుకు అయిన చంద్రబాబు ఇంత వరకూ ఎన్టీఆర్ పేరు పెట్టకపోవటం వల్లే జగన్ కు ఈ అవకాశం దక్కిందని ఓ టీడీపీ నేత వ్యాఖ్యానించారు. ఎవరూ అడగకపోయినా చంద్రబాబు పలు పథకాలకు మాత్రం ‘చంద్రన్న’ పేరు పెట్టేస్తున్నారు. తెలుగుదేశం ప్రతి పనిలో ‘రాజకీయం’ వెతుకుతుంది కాబట్టి...వాళ్ళు కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు అంశానికి...ప్రత్యేక హోదాకు లింక్ పెడుతున్నారు. చంద్రబాబు సభ ఎప్పుడో సోమవారం సాయంత్రం. కానీ జగన్ ప్రకటన చేసింది ఉదయమే. అయినా ఎందుకు టీడీపీలో షాక్. ఓ మంత్రి అయితే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని వ్యాఖ్యానించటం కలకలం రేపుతోంది.

Next Story
Share it