Telugu Gateway
Politics

తెలంగాణలో కొత్త పార్టీ

తెలంగాణలో కొత్త పార్టీ
X

తెలంగాణ రాజకీయాల్లో కొత్త పరిణామం. ఇఫ్పటివరకూ ప్రజా ఉద్యమాలకే పరిమితం అయిన జెఏసీ కొత్త పార్టీగా అవతరించింది. జెఏసీ ఛైర్మన్ కోదండరాం ఈ పార్టీని స్థాపించారు. ఈ విషయాన్ని ఆయన సోమవారం నాడు అధికారికంగా ప్రకటించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యానికి విలువలేకుండా పోయిందని కోదండరాం వ్యాఖ్యానించారు. దేశంలో సచివాలయానికి రాకుండా పరిపాలన సాగిస్తున్న సీఎం కెసీఆర్ ఒక్కరే అని విమర్శించారు. తమ పార్టీ పేరు తెలంగాణ జనసమితి అని వెల్లడించారు. ఈ నెల 29న హైదరాబాద్‌లో తెలంగాణ జనసమితి పార్టీ ఆవిర్భావ సభ ఉంటుందని తెలిపారు. తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రత్యామ్నాయంగా రాజకీయ పార్టీని ఏర్పాటుచేయాలనే చర్చ టీజేఏసీలో కొన్నాళ్లుగా కొనసాగుతూ వచ్చింది. ఇటీవలే పార్టీ ఏర్పాటుకు లాంఛనంగా సమ్మతి తెలిపిన కోదండరాం.. ఆ దిశగా కొన్నిరోజులుగా సంకేతాలు ఇస్తూ వస్తున్నారు. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ వివిధ పార్టీలు, ప్రజాసంఘాలతో ఏర్పాటుచేసిన జేఏసీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. జేఏసీ చైర్మన్‌గా కోదండరాం ఉద్యమంలో విశేషమైన పాత్ర పోషించారు. తెలంగాణ వచ్చిన తర్వాత గత ఎన్నికల్లో జేఏసీ ఒకరకంగా తటస్థమైన పాత్రనే పోషించింది.

ఆ తర్వాత క్రమంగా జేఏసీ టీఆర్‌ఎస్‌కు దూరం జరుగుతూ వచ్చింది. ముఖ్యంగా కేసీఆర్‌ పరిపాలన విధానంపై జేఏసీ చైర్మన్‌ కోదండరాం గతకొంతకాలంగా పదునైన విమర్శలతో విరుచుకుపడుతున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలమైందని విమర్శల ధాటి పెంచారు. ఈ నేపథ్యంలో అధికార టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా కోదండరాం రాజకీయ పార్టీని తెరపైకి తెచ్చినట్టు కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం విలేకరుల సమావేశం పెట్టి మరీ కెసీఆర్ జెఏసీ ఛైర్మన్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ఎప్పుడైనా కనీసం సర్పంచ్ గా అయినా గెలిసిండా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ తరుణంలో జెఏసీ ఏకంగా కొత్త పార్టీ పెట్టి బరిలోకి దిగటం ఆసక్తికర పరిణామంగా మారింది.

Next Story
Share it