Telugu Gateway
Telugugateway Exclusives

నరేంద్రమోడీ..శిఖరం నుంచి పాతాళానికి!

నరేంద్రమోడీ..శిఖరం నుంచి పాతాళానికి!
X

అవి 2014 సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తొలి రోజులు. నరేంద్రమోడీ అప్రతిహత విజయాన్ని అందుకుని..ఇమేజ్ లో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్న రోజులు. ఆయన ఒక్క పిలుపునిస్తే చాలు...దేశ ప్రజలంతా స్పందించే పరిస్థితి. అప్పటికే పీకల్లోతు అవినీతి ఆరోపణలతో కూరుకుపోయిన కాంగ్రెస్ ను చూసిన ఓటర్లు మోడీనే సరైన ప్రత్యామ్నాయం అని నమ్మారు. పట్టం కట్టారు. అంతటి అద్బుత విజయాన్ని అందుకున్న మోడీ...ప్రజలను మెప్పించే నిర్ణయాలు తీసుకుని దూసుకెళతారని అనుకుంటే..పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కన్పిస్తోంది. నాలుగేళ్లలో సీన్ రివర్స్ అయినట్లే ఉంది. ప్రధాని మోడీ ఇమేజ్ శిఖరం నుంచి పాతాళానికి వడివడిగా పడిపోతోంది. ముందు పెద్ద నోట్ల రద్దు..ఆ తర్వాత జీఎస్టీ అమలు వంటి నిర్ణయాలు మధ్య తరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపాయి. ఆ తర్వాత వరస పెట్టి చోటుచేసుకుంటున్న బ్యాంకు కుంభకోణాలు మోడీ సర్కారు ను ప్రతిష్టను పూర్తిగా మసకబార్చాయనే చెప్పొచ్చు. ఏకంగా బిజెపి అధ్యక్షుడు అమిత్ షా తనయుడి కంపెనీలపై ఆరోపణలు. కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ కంపెనీలు తీవ్ర వివాదాల్లో చిక్కుకోవటం. రాఫెల్ విమానాల కొనుగోలు డీల్ పై అనుమానపు మేఘాలు. ఇప్పుడు దేశంలో అమ్మాయిలపై జరిగే లైంగిక వేధింపులు..రేపు కేసుల్లో బిజెపి నేతలే ఎక్కువగా ఉండటం వంటి అంశాలు కూడా మోడీ వ్యక్తిగత ప్రతిష్టతోపాటు...బిజెపి ప్రభుత్వ పరువుకు తీవ్ర భంగం కలిగించాయనే చెప్పొచ్చు. విపక్షంలో ఉండగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ను మౌనముని అంటూ తీవ్ర విమర్శలు చేసిన ఇదే నరేంద్రమోడీ..దేశంలో ఎంత పెద్ద ఘటన..దారుణ సంఘటనలు జరిగినా మౌనాన్నే ఆశ్రయించటంతో...మోడీ కంటే మన్మోహన్ సింగే బెటర్ అనే పరిస్థితి వచ్చింది.

కాంగ్రెస్ హయాంలో సాగిన తరహాలోనే ఎన్డీయే జమానాలోనూ కార్పొరేట్లకు సంబంధించిన లక్షల కోట్ల రూపాయల రుణాల రద్దు వంటి అంశాలు కూడా మధ్యతరగతిలో తీవ్ర అసంతృప్తిని రేపుతున్నాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నిర్వహణ తీరును చూసిన తర్వాత మోడీపై ప్రజల్లో ఉన్న అంచనాలు అన్నీ పటాపంచలు అయ్యాయనే చెప్పొచ్చు. నాలుగేళ్ల కాలంలో దేశంపై ‘మోడీ అభివృద్ధి ముద్ర’ అంటూ ఏదీ కన్పించటంలేదనే విమర్శలు విన్పిస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్ళలో ఎంతో హంగామా చేసిన ‘స్మార్ట్ సిటీల’ ప్రాజెక్టు కూడా ఎక్కడా పెద్దగా టేకాఫ్ అయినట్లు కన్పించటం లేదు. మరి ఎన్నికల వేళ కొత్త సెంటిమెంట్లను రాజేసి తిరిగి అధికారంలోకి వస్తారో..లేక ఇంటిదారి పడతారో వేచిచూడాల్సిందే. ఇక తెలుగు రాష్ట్రాల్లో..ముఖ్యంగా ఏపీలో అయితే మోడీ సర్కారుపై వ్యతిరేకత దేశంలో ఎక్కడాలేని రీతిలో ఉందని చెప్పొచ్చు.

Next Story
Share it