Telugu Gateway
Telangana

టాలీవుడ్ వివాదంపై ‘నాగబాబు వార్నింగ్’

టాలీవుడ్ వివాదంపై ‘నాగబాబు వార్నింగ్’
X

గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై నటుడు నాగబాబు స్పందించారు. పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ కొత్తగా వచ్చిందేమీ కాదన్నారు. తప్పు చేసిన వారిని చెప్పు తీసుకుని కొట్టి..కేసు పెట్టొచ్చని వ్యాఖ్యానించారు. శ్రీ రెడ్డి వ్యవహారం దారి తప్పిందని ఆరోపించారు. ఈ వ్యవహారంలోకి మెగా ఫ్యామిలీని లాగొద్దని నాగబాబు వార్నింగ్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ను ఇందులో ఇరికించాలని కొంత మంది ప్రయత్నిస్తున్నారని..అతని వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. సినిమాలు తీసుకుంటూ హాయిగా బతికే అవకాశం ఉన్నా..ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. తమ కుటుంబ సభ్యులను ఇందులోకి లాగాలని ప్రయత్నిస్తే తర్వాత జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నాగబాబు హెచ్చరించారు. బుధవారం ఫిల్మ్‌ చాంబర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగబాబు మాట్లాడారు. ‘మా’ ఎవరికి అవకాశాలు ఇప్పించదని, కేవలం సభ్యుల సమస్యలను మాత్రమే పరిష్కరిస్తుందని చెప్పారు. ఉచితంగా మా సభ్యత్వం ఇవ్వరని తెలిపారు. ఈ విషయంలో మా అసోసియేషన్‌ అధ్యక్షుడు శివాజీ రాజాను నిందించడం తప్పని అన్నారు.

అవగాహన లేకుండా మా గురించి ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. నెల రోజుల నుంచి పరిశ్రమలో జరిగే సంఘటనలు గమనిస్తున్నానని, శ్రీరెడ్డి వ్యవహారం అసలు విషయం వదిలేసి పక్కదారి పట్టిందని చెప్పారు. ‘ప్రతి విషయానికి సినిమా ఇండస్ట్రీ మొత్తం కదలి రావాల్సిన పని లేదు. నా లాంటి ఎవరో ఒకరు చాలు. ఈ విషయాన్ని చాలా సులువుగా పరిష్కరించవచ్చు. తెలుగువాళ్లకే క్యారెక్టర్లు ఇవ్వాలి అంటున్నారు. తెలుగు వాళ్లకు కాకపోతే ఇంకెవరికి ఇస్తున్నాం?. హీరో, హీరోయిన్లు, కొన్ని విలన్‌ క్యారెక్టర్లు సదరు సినిమా అవసరాన్ని బట్టి నిర్మాతలు తీసుకుంటున్నారు. అన్ని సినిమాలు చెత్తగానే తీసున్నామా? బ్యాడ్‌గానే చూపిస్తున్నామా. సినిమాల్లో ఉండేవాటిని చూసి జనాలు చెడిపోతున్నారా?. సినిమాల్లోని అంశాలను చూసి జనాలు చెడిపోతున్నారని మీరే అంటున్నారు కదా. సినిమాల్లో చూపించే మంచిని ఎందుకు ఫాలో కావడం లేదో మీరే చెప్పండి. నోరు మూసుకుని ఉంటే ఫిల్మ్‌ ఇండస్ట్రీ మీ అందరికీ ఒక సాఫ్ట్‌ టార్గెట్‌గా మారింది. ఇక్కడకు వచ్చి చూడండి. బయట నిలబడి ఇండస్ట్రీ గురించి మాట్లాడే హక్కు మీకు లేదు.

మీకు మీ సంఘాలకు ఎంత గొప్పతనం ఉందో మాకూ అంతే ఉందన్న విషయం గుర్తుంచుకోవాలి. ఇండస్ట్రీపై నోటికి వచ్చినట్లు పేలొద్దు. టాలీవుడ్‌ నుంచి ఎన్నో గొప్ప చిత్రాలు వచ్చాయి. ఇప్పటికీ తీస్తున్నారు. 10 శాతం నుంచి 20 శాతం వరకూ వచ్చే చెత్త సినిమాల పేరిట ఇండస్ట్రీ మొత్తాన్ని బాధ్యులను చేయడం సరికాదు. కమర్షియల్‌ సినిమాలు తీస్తే తప్పేంటి? రామాయణ, మహాభారతాలు తప్ప మరే సినిమాలు తీయకూడదా?. మీరు అలాంటి సినిమాలు చూడకండి. సినిమాల్లో హింస తదితర అంశాలను తగ్గించడానికి ప్రయత్నిస్తాం. సెన్సార్‌ అప్రూవల్‌ తర్వాతే సినిమాలు విడుదల అవుతున్నాయి. సెన్సార్‌ అనుమతితో విడుదలైన సినిమాలపై మీరు ఎలా మాట్లాడతారు? సినిమా ఇండస్ట్రీలో నీతి, నిబద్దత కలిగిన వారు చాలామంది ఉన్నారని నాగబాబు వ్యాఖ్యానించారు.

Next Story
Share it