Telugu Gateway
Telangana

మక్కా మసీదు కేసు క్లోజ్

మక్కా మసీదు కేసు క్లోజ్
X

హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన మక్కా మసీదు పేలుళ్ళ కేసు..అంతే సంచలనంగా క్లోజ్ అయింది. ఈ కేసు ప్రకంపనలు కొనసాగుతున్నాయి. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక కోర్టు తీర్పుపై రాజకీయ పార్టీలు తీవ్ర స్థాయిలో ద్వజమెత్తాయి. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ అయితే కేంద్ర దర్యాప్తు సంస్థ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో అందరూ నిర్ధోషులు అయితే..మరి పేలుళ్ళు జరిపింది ఎవరు అంటూ ప్రశ్నించింది. 2007 మే 18 తేదీన మధ్యాహ్నం సమయంలో మక్కా మసీద్‌లో ప్రార్ధన సమయంలో టిఫిన్ బాంబు ద్వారా పేలుడు జరిగింది. ఈ పేలుడు దాటికి 9 మంది చనిపోయారు. ఆ తర్వాత జరిగిన కాల్పుల్లో మరో ఐదుగురు మరణించారు. నిందితులపై నేరారోపణలు నిరూపించటంలో ప్రాసిక్యూషన్‌ విఫలమైందన్న ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు.. వారిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో 11 ఏళ్ల సుదీర్ఘ దర్యాప్తు చేపట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) 226 మంది సాక్ష్యులను విచారణ చేపట్టింది.

ఛార్జీషీట్‌లో 10 మంది పేర్లను చేర్చగా.. వారిలో ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు తుది తీర్పు ఇచ్చింది. ఐదుగురు నిందితులు స్వామి అసిమానంద, భరత్‌, దేవెందర్‌ గుప్తా, రాజేందర్‌, లోకేశ్‌ శర్మలలో ఏ ఒక్కరిపైనా ఆరోపణలను ప్రాసిక్యూషన్‌ రుజువు చేయలేక పోయింది. దీంతో వారిని నిర్దోషులుగా ప్రకటించారు. అయితే మిగతా వారిపై మాత్రం ఛార్జీ షీట్‌ కొనసాగుతుందని కోర్టు తెలిపింది. మక్కా బ్లాస్ట్‌ కేసులో 10 మంది నిందితులను గుర్తించిన ఎన్‌ఐఏ.. ఐదుగురి పేర్లను మాత్రం చార్జీషీట్‌లో చేర్చింది. హిందూ దేవాలయాల్లో బాంబులు పేలుస్తున్నారన్న ఆరోపణలకు ప్రతీకారంగానే నిందితులు ఈ దాడులకు పాల్పడినట్లు ఎన్‌ఐఏ కోర్టుకి తెలిపింది. తీర్పు నేపథ్యంలో హైదరాబాద్‌లో అలర్ట్ ప్రకటించిన పోలీస్‌ శాఖ.. పాతబస్తీ, నాంపల్లి కోర్టు దగ్గర ప్రత్యేక బలగాలతో భారీ భద్రత కట్టుదిట్టం చేసింది.

Next Story
Share it