Telugu Gateway
Cinema

‘మా’ రివర్స్ గేర్

‘మా’ రివర్స్ గేర్
X

మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ (మా) రివర్స్ గేర్ వేసింది. నటి శ్రీరెడ్డికి తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన మా తానే జారుకుంది. అబ్బే..అదేదో భావోద్వేగంలో తీసుకున్న నిర్ణయం..ఇక నీకు ఇబ్బందులు ఏమీ ఉండవు. సినిమాలు చేసుకోవచ్చు..ఏమైనా సమస్య వస్తే మా దగ్గరకు రావచ్చు అంటూ మా అధ్యక్షుడు శివాజీరాజా ప్రకటించారు. శ్రీరెడ్డి వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల సంఘం తెలంగాణ సర్కారుకు నోటీసులు జారీ చేయటం...పరిశ్రమకు చెందిన పలువురి జాతకాలు శ్రీరెడ్డి ఒక్కటొక్కటిగా బహిర్గతం చేస్తుండటంతో పరిశ్రమలో ఓ రకమైన అలజడి ఏర్పడింది. కారణాలు ఏమైనా మా మాత్రం శ్రీరెడ్డి విషయంలో మా వెనక్కి తగ్గాల్సి వచ్చింది. సినీ ఇండస్ట్రీలో అవకాశాల పేరిట వేధింపులు జరుగుతున్నాయంటూ అర్ధనగ్న నిరసన తెలపడంతో శ్రీరెడ్డికి 'మా' సభ్యత్వం నిరాకరించడంతో ఆమెపై నిషేధం విధించారు. అనంతరం శ్రీరెడ్డి చేసిన పోరాటానికి మహిళా సంఘాలు మద్దతు తెలపడంతో పాటు సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిసి మెమోరాండం ఇచ్చిన విషయం తెలిసిందే.

'మా' అధ్యక్షుడు శివాజీరాజా మీడియాతో మాట్లాడుతూ.. శ్రీరెడ్డి చేసిన ఆరోపణలు, మాటలు, చర్యలతో కేవలం 'మా' మాత్రమే కాదు, ఎంతో మంది ఆర్టిస్టులు మనస్తాపానికి లోనయ్యారు. అందుకే ఆమెపై బ్యాన్‌ నిర్ణయాన్ని తీసుకున్నాం. అయితే ఆమెపై విధించిన బ్యాన్‌ను ఎత్తివేయాలని, నిషేధంపై పున:పరిశీలించాలని 'మా' సభ్యులు కోరడంతో ఆమెపై నిషేధం ఎత్తివేస్తున్నాం. టాలీవుడ్‌లో కమిటీ అగైనెస్ట్ సెక్యువల్ హెరాస్‌మెంట్ (క్యాష్) కమిటీని ఏర్పాటు చేశాం. ఆమెను మేం ఆహ్వానిస్తున్నాం. ఎవ్వరితోనైనా ఆమె నటించొచ్చు. నిర్మాతలు, దర్శకులు ఆఫర్లు ఇస్తే ఆమె ఏ సినిమాలోనైనా నటించే స్వేచ్ఛ ఆమెకు ఉంది. శ్రీరెడ్డితో రెండు సినిమాలు చేస్తానని తేజ హామీ ఇచ్చారంటూ' వివరించారు.

Next Story
Share it