Telugu Gateway
Movie reviews

‘కృష్ణార్జున యుద్ధం’ మూవీ రివ్యూ

‘కృష్ణార్జున యుద్ధం’ మూవీ రివ్యూ
X

టాలీవుడ్ లో వరస హిట్లతో ముందుకు సాగుతున్న హీరోల్లో నాని ఒకరు. ఈ మధ్య కాలంలో నాని సినిమా ఏదీ కూడా ఫ్లాప్ అని చెప్పే పరిస్థితి లేదు. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి) కూడా ఓ మోస్తరు విజయాన్నే దక్కించుకుంది. నాని ద్విపాత్రిభినయం చేసిన సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమా గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు దర్శకుడు మేర్లపాక గాంధీ పూర్తిగా పాత కథనే ఎంచుకున్నారు. ఫస్టాఫ్ లో ఓ ఊరిలో అల్లరచిల్లరగా తిరుగుతూ వ్యవసాయ పనులు చూసుకునే కృష్ణ (నాని) చేసే కామెడీనే సినిమాను ఒకింత సరదాగా నడిపిస్తుంది. ఊరిలో ఉండే అమ్మాయిలు అందరినీ వేధిస్తూ ఉండే కృష్ణకు ఆ గ్రామంలోని సర్పంచ్ మనమరాలు రియా (రుక్సర్)తో ప్రేమలో పడతాడు. డాక్టర్ చదివిన ఈ అమ్మాయి సెలవులకు ఊరొచ్చి కృష్ణతో ప్రేమతో పడుతుంది. మరో క్యారెక్టర్ అర్జున్ (నాని) యూరప్ లో రాక్ స్టార్ గా కన్సర్ట్స్ నిర్వహిస్తుంటాడు. అదే సమయంలో అర్జున్ కన్పించిన అమ్మాయితో తిరుగుతూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటాడు. ఆ క్రమంలోనే సుబ్బలక్ష్మి (అనుపమ పరమేశ్వరన్ ) తో పరిచయం ఏర్పడుతుంది.

అయితే అర్జున్ వ్యవహారం తెలిసిన సుబ్బలక్ష్మి ప్రేమకు ససేమిరా అంటుంటుంది. ఈ క్రమంలోనే సుబ్బలక్ష్మి, రియాలు హైదరాబాద్ చేరుకుంటారు. ఆ క్రమంలోనే ఇద్దరు అమ్మాయిలను అక్రమ రవాణా చేసే ముఠా చేతికి చిక్కుతారు. వీరిద్దరిని వెతుక్కుంటూ వచ్చే క్రమంలోనే కృష్ణ, అర్జున్ లు రంగంలోకి దిగుతారు. చివరకు అమ్మాయిలను అక్రమ రవాణా చేసే గ్యాంగ్ నుంచి సుబ్బలక్ష్మి, రియాలను రక్షిస్తారు. దీంతో కథ సుఖాంతం అవుతుంది. అయితే హీరో నాని రెండు క్యారెక్టర్ల విషయంలో వేరియేషన్స్ ను బాగా చూపించాడు. తొలి సినిమా అయినా రుక్సర్ తన పాత్రకు న్యాయం చేసింది. అనుపమ పరమేశ్వరన్ కూడా ఓకే. చిత్తూరు జిల్లా యాసతో మాట్లాడుతూ కృష్ణ క్యారెక్టరే సినిమాలో నవ్వులు పండిస్తుంది. ఓవరాల్ గా చూస్తే కృష్ణార్జున యుద్ధం సినిమా రొటీన్ ఎంటర్ టైనర్ సినిమానే.

రేటింగ్. 2.5/5

Next Story
Share it