Telugu Gateway
Telangana

కాంగ్రెస్ పై మాటమార్చిన కెసీఆర్

కాంగ్రెస్ పై మాటమార్చిన కెసీఆర్
X

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కెసీఆర్ సడన్ గా మాట మార్చారు. ఇంత కాలం బిజెపి, కాంగ్రెస్ లు దేశాన్ని నాశనం చేశాయని...డెబ్బయి ఏళ్ళలో దేశాన్ని ఎంతో వెనక్కి తీసుకెళ్లాయంటూ ప్రకటించిన కెసీఆర్ తాజాగా చెన్నయ్ లో చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. బిజెపి, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయంగానే కెసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ నినాదం అందుకున్న విషయం తెలిసిందే. చెన్నయ్ లో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ తో పనిచేస్తామని కానీ..దూరంగా ఉంటామని చెప్పలేదని వ్యాఖ్యానించారు. అంటే కాంగ్రెస్ తో ఆప్షన్ ఓపెన్ గా ఉంచుకున్నట్లు కెసీఆర్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు అయింది. తాజాగా జరిగిన ప్లీనరీలోనూ దేశాన్ని ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్, బిజెపిలు దశ, దిశా లేకుండా చేశాయని ఘాటుగా వ్యాఖ్యానించారు. డీఎంకె ప్రస్తుతం కేంద్రంలో కాంగ్రెస్ కు మద్దతుగా ఉన్న విషయం తెలిసిందే. డీఎంకె నేతలతో భేటీ తర్వాత కెసీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆదివారం నాడు కెసీఆర్ తన ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాల్లో భాగంగా చెన్నయ్ పర్యటనకు వెళ్ళి డీఎంకె నేతలతో సమావేశం అయ్యారు. డీఎంకే అధినేత ఎం.కరుణానిధితో భేటీ అయ్యారు. ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌తోనూ సుదీర్ఘ చర్చలు జరిపారు.

అనంతరం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇది ఆది కాదు.. అంతం కాదు.. దేశ రాజకీయాల్లో, పాలనలో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉంది. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దేశ ప్రగతి, ఆర్థిక అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాల కోసం వివిధ రాష్ట్రాల్లోని అనుభవజ్ఞులు, అన్ని పార్టీల నాయకులతో చర్చలు కొనసాగుతాయి..’’అని చెప్పారు. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం పోవాలని వ్యాఖ్యానించారు. తమది థర్డ్‌ ఫ్రంట్‌.. నాలుగో ఫ్రంట్‌.. ఐదో ఫ్రంట్‌ కాదని, ప్రజాఫ్రంట్‌ అని స్పష్టంచేశారు. ‘‘దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఆ లక్ష్య సాధనలో భాగంగా నా ప్రయాణం సాగుతుంది. ఏకాభిప్రాయం వచ్చేదాకా అందరితో చర్చలు జరుపుతాం. రాష్ట్రాలకు కేంద్రం మరిన్ని అధికారాలు ఇవ్వాలి. కేంద్రానికి సంబంధం లేని అంశాలను రాష్ట్రాలకు అప్పగించాలి. విద్య, వైద్య, తాగు, సాగునీరు వంటి అంశాలతోపాటు ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్రం విఫలమైంది’’అని కెసీఆర్ అన్నారు.

Next Story
Share it