Telugu Gateway
Movie reviews

‘కణం’ మూవీ రివ్యూ

‘కణం’ మూవీ రివ్యూ
X

కొంత మంది దర్శకులు కొత్త కొత్త కథలతో ప్రయోగాలు చేస్తున్నారు. దర్శకుడు విజయ్ ‘కణం’ సినిమా ద్వారా ఓ పెద్ద ప్రయోగమే చేశాడని చెప్పొచ్చు. ఈ ప్రయోగంలో పాలుపంచుకున్నారు హీరో నాగశౌర్య, హీరోయిన్ సాయిపల్లవి. ఎప్పటి నుంచో ఉన్న అబార్షన్ ల అంశాన్ని తీసుకుని సినిమా చేయటం అంటే ఓ సాహసమే అని చెప్పొచ్చు. కానీ విజయ్ మాత్రం ఈ సాహసంలో సక్సెస్ అయ్యారు. కమర్షియల్ హంగులు ఏ మాత్రం లేకపోయినా..ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోకుండా హీరో, హీరోయిన్లు అద్భుతంగా నటించారు ఈ సినిమాలో. ఇక సినిమా అసలు కథ విషయానికి వస్తే కృష్ణ ( నాగశౌర్య), తులసి (సాయిపల్లవి) చదువుకుంటూ ప్రేమలో పడతారు. అంతే కాదు..వారిద్దరూ శారీరకంగాను ఒక్కటి కావటంతో తులసి గర్బవతి అవుతుంది. ఈ విషయం ఇద్దరి తల్లితండ్రులతో తెలవటంతో పెద్ద వివాదమే అవుతుంది. కానీ అంతిమంగా తులసికి అబార్షన్ చేయించాలని ఇరు కుటుంబాల సభ్యులు నిర్ణయిస్తారు. ఐదేళ్ళ తర్వాత వీరిద్దరికి పెళ్ళి చేయాలని పెద్దలు నిర్ణయించుకుంటారు. తులసికీ ఇష్టం లేకపోయినా డాక్టర్ ఆమెకు అబార్షన్ చేసేస్తారు. పెళ్ళైన తర్వాత కూడా తులసీ తనకు కూతురు పుట్టి ఉంటే ఎంత వయస్సు ఉండేది...ఎలా ఉండేది ఊహించుకుంటూ ఓ డైరీలో ఎప్పటికప్పుడూ చిత్రాలు గీస్తూ ఉంటుంది.

ఎంత కాలం జరిగిన సంఘటనను తలచుకుని బాధపడతావు..మళ్ళీ నార్మల్ జీవితంలోకి రావాలని కృష్ణ కోరతాడు. అలా అనుకుని ఇద్దరూ ఎవరి ఉద్యోగాలు వారు చేసుకుంటూ ముందుకు సాగుతుంటారు. ఈ దశలో కథ కొత్త ట్విస్ట్ తీసుకుంటుంది. తనను భూమిపైకి రాకుండా చేసిన వారందరిపై అబార్షన్ కు గురైన పాప (దియా) పగ పెంచుకుంటుంది. తన తల్లికి దూరం చేసిన వారందరిపైనా పగ తీర్చుకుంటుంది. ఆ పగతోనే తులసీ అబార్షన్ కు కారణమైన వారందరినీ హతమారుస్తుంది. ఈ సినిమాను అత్యంత ఆసక్తికర సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కించటంలో దర్శకుడు విజయవంతం అయ్యాడు. తులసీ పాత్రలో సాయిపల్లవి, కృష్ణగా నాగశౌర్యలు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మొత్తానికి ‘కణం’ ఓ కొత్త ప్రయోగంగా చెప్పుకోవచ్చు. అబార్షన్ లకు వ్యతిరేకంగా తీసిన ఈ సినిమా ఎంటర్ టైన్ మెంట్ కోరుకునే ప్రేక్షకులకు మాత్రం నచ్చకపోవచ్చు.

రేటింగ్. 2.75/5

Next Story
Share it