Telugu Gateway
Andhra Pradesh

ఐబీ డైరక్టర్ అమరావతి పర్యటన వెనక మర్మమేమిటి?

ఐబీ డైరక్టర్ అమరావతి పర్యటన వెనక మర్మమేమిటి?
X

ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్. కేంద్ర నిఘా విభాగం అధిపతి అమరావతి ఆకస్మిక పర్యటన వెనక కారణాలు ఏమై ఉంటాయి. ఓ వైపు కేంద్రం ఏ క్షణంలో అయినా ఏపీలో కొంత మంది ఐఏఎస్ అధికారులు...మంత్రుల అవినీతిని టార్గెట్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న తరుణంలో జరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐబీ చీఫ్ రాజీవ్ జైన్ సమావేశం రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా వేడి పుట్టించింది. కొద్ది రోజుల క్రితం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. భారత్ లో బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి లండన్ కు చెక్కేసిన విజయ్ మాల్యాతో చంద్రబాబు లండన్ లో సమావేశం అయ్యారని వ్యాఖ్యానించారు.

తాజాగా మరో సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా చెన్నయ్ కు చెందిన శేఖర్ రెడ్డితో చంద్రబాబుకు సంబంధాలు ఉన్నాయని..ఆయన ద్వారా చంద్రబాబు 500 కోట్ల రూపాయల బ్లాక్ మనీ మార్చుకున్నారని ఆరోపించారు. దీనికి సంబంధించి తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని బొత్స వ్యాఖ్యానించటం విశేషం. దీనికి తోడు ఏపీలో అటు అమరావతి పనులు దగ్గర నుంచి సాగునీటి ప్రాజెక్టులు..పలు విభాగాల్లో అవినీతిపై కేంద్రానికి భారీ ఎత్తున ఫిర్యాదులు కూడా చేరాయి. ఈ తరుణంలో ఐబీ చీఫ్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటన వెనక ఉద్దేశం ఏమిటా? అన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఐబీ చీఫ్ కు ప్రధాని నరేంద్రమోడీపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఫిర్యాదు చేసినట్లు వార్తలు రావటం చర్చనీయాంశంగా మారింది.కేంద్రం ఐబీ డైరక్టర్ తో ఏమైనా సందేశం పంపిందా? అన్న అంశంపై కూడా ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. చంద్రబాబు తాజాగా సింగపూర్ పర్యటనలో ఏకంగా ప్రధాని నరేంద్రమోడీపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశాన్ని కూడా కేంద్రం సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం. దీనిపై వీరిద్దరి మధ్య చర్చ జరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Next Story
Share it