Telugu Gateway
Telangana

కెసీఆర్ 17 సీట్లతో దేశ ఏజెండా ‘పిక్స్ చేస్తారా’!

కెసీఆర్ 17 సీట్లతో దేశ ఏజెండా ‘పిక్స్ చేస్తారా’!
X

రాజకీయాలు అంటేనే నెంబర్ గేమ్. ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వారి ఆటకే ప్రాధాన్యత. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నదే 17 ఎంపీ సీట్లు. హైదరాబాద్ ఎంపీ సీటు ఎంఐఎంకు వదిలేసి...గుండుగుత్తగా 16 సీట్లు కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) కే వచ్చాయని అనుకుందాం కాసేపు. అది ఓన్లీ చర్చ కోసమే. ఈ 16 సీట్లతో దేశ దశ, దిశను మార్చే ఏజెండాను కెసీఆర్ ఫిక్స్ చేయగలరా?. ఆయన ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ లో ప్రస్తుతానికి ఇంకా ఎవరు ఉంటారో..ఎవరు ఉండరో క్లారిటీ లేదు. కొన్ని పార్టీలు వచ్చినా కెసీఆర్ కు ఉన్నట్లే ఎవరి ఏజెండా వారికి ఉంటుంది. వారి వారి రాష్ట్ర ప్రయోజనాలు చూసుకుంటారు తప్ప...కెసీఆర్ ఏజెండాకు వారెందుకు జై కొడతారు? అన్నది మౌలికమైన ప్రశ్న. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ కాకపోతే సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది. అది బిజెపి, కాంగ్రెస్ లేకుండా ఉండే ప్రశ్నేలేదనేది అందరికీ తెలిసిన విషయమే. సంకీర్ణ సర్కారు అనివార్యం అయితే...అవసరం అయిన పార్టీ కెసీఆర్ ఎంపీల మద్దతు తీసుకుని మహా అయితే ఓ రెండు, మూడు మంత్రి పదవులు ఇవ్వొచ్చు. అంతే కానీ..కెసీఆర్ ఏకపక్షంగా ఫిక్స్ చేసిన ఏజెండాకు ఇతర రాష్ట్రాల నేతలు అందరూ ఓకే అనే అవకాశం ఉంటుందా?.అంటే ఖచ్చితంగా ఉండదనే రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. కెసీఆర్ శుక్రవారం నాడు జరిగిన ప్లీనరీలో మౌలికసదుపాయాలు, పర్యాటక రంగాల గురించి ప్రస్తావించారు. అధికారంలోకి వచ్చిన కొత్తలోనే సీఎం కెసీఆర్ హైదరాబాద్ చుట్టుపక్కల రెండు విమానాశ్రయాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు

.నాలుగైదు సంవత్సరాల్లోనే ఇవి వస్తాయని తెలిపారు. కానీ కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు సంబంధించి అడుగు ముందుకు పడలేదు. పైగా ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. చాలా చోట్ల కనీస మౌలికసదుపాయాలు లేక పర్యాటకులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. తెలంగాణలోని బస్టాండ్లలోనూ అదే పరిస్థితి. ప్రజల కనీస వసతుల కల్పనపై దృష్టి సారించని కెసీఆర్ దేశంలోని ప్రభుత్వాలపై విమర్శలు చేయటం విడ్డూరంగా ఉందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. తెలంగాణలోని సమస్యలు చర్చకు రాకుండా చేసి..జాతీయ ఏజెండాను తెరపై పెట్టి వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనేది కెసీఆర్ వ్యూహంగా చెబుతున్నారు. అదే సమయంలో తాను జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టాను కాబట్టి...తన తనయుడు, మంత్రి కెటీఆర్ కు రాష్ట్రంలో లైన్ క్లియర్ చేయటానికి దీన్ని ఓ అవకాశంగా మార్చుకుంటున్నారని టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కెటీఆర్ ప్రభుత్వంలో కీలకంగా మారిన సంగతి తెలిసిందే. ఓ వైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనకు 25 ఎంపీ సీట్లు ఇస్తే...ప్రధాని ఎవరో నేనే డిసైడ్ చేస్తా అంటున్నారు. కెసీఆర్ మాత్రం తెలంగాణలో ఉన్న 17 ఎంపీ సీట్లతో దేశ రాజకీయాలకు కొత్త దశ, దిశ చూపిస్తానని ప్రకటిస్తున్నారు. ఎవరి ప్రయత్నాలు ఫలిస్తాయో వేచిచూడాల్సిందే.

Next Story
Share it