Telugu Gateway
Telangana

తెలంగాణ సర్కారుపై హైకోర్టు సీరియస్

తెలంగాణ సర్కారుపై హైకోర్టు సీరియస్
X

శాసనసభ నుంచి ఇద్దరు కాంగ్రెస్ సభ్యుల సభ్యత్వాల రద్దు వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోంది. ఈ అంశంపై మంగళవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు ఆదేశించినా కూడా ప్రభుత్వం ఇంత వరకూ ఈ అంశానికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయకపోవటంతో హైకోర్టు సీరియస్ అయింది. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారనే అంశంపై కాంగ్రెస్‌ శాసనసభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ శాసనసభ్యత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే వీరి శాసనసభ స్థానాలు ఖాళీ అని నోటిఫై చేయటం. ఎన్నికల కమిషన్ కు కూడా వివరాలు పంపటం చాలా స్పీడ్ గా జరిగిపోయాయి. ఈ నిర్ణయాన్ని తప్పుపడుతూ కోమటిరెడ్డి, సంపత్ లు హైకోర్టును ఆశ్రయించగా..వీరి స్థానాల్లో ఎన్నికల నోటిఫికేషన్ ఆరు వారాల వరకూ జారీ చేయవద్దని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.

మంగళవారం నాడు ఈ కేసును విచారించిన హైకోర్టు ఈ నెల 6 వ తేదీ లోపల కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని మరోసారి ఆదేశించింది. ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేసిన అనంతరం.. సోమవారం( 9 వ తేదీ) వాదనలు వింటామని హైకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ కౌంటర్‌ ఫైల్‌ చేయకపోతే.. ఈ కేసులో ఇక కౌంటర్‌ ఉండదని భావించాల్సి ఉంటుందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. తదుపరి విచారణ ఈ నెల 9 వ తేదీకి వాయిదా వేసింది. గవర్నర్ ప్రసంగించిన రోజు మొత్తం వీడియో ఫుటేజ్ ఇవ్వాలని పిటీషనర్లు కోరారు. అడ్వకేట్ జనరల్ గా ఉన్న దేశాయ్ ప్రకాష్ రెడ్డి అసెంబ్లీలో జరిగిన అంశానికి సంబంధించిన ఫుటేజీ ఇస్తామని కోర్టుకు తెలిపారు. కానీ తర్వాత ప్రభుత్వం ఈ విషయంలో అంత ఆసక్తి చూపించకపోవటంతో ప్రకాష్ రెడ్డి ఏకంగా తన పదవికే రాజీనామా చేసిన సంగతి విదితమే.

Next Story
Share it