Telugu Gateway
Andhra Pradesh

‘నలుగురు’ ఏపీ మంత్రులకు చిక్కులు తప్పవా!

‘నలుగురు’ ఏపీ మంత్రులకు చిక్కులు తప్పవా!
X

కేంద్రంలోని ఎన్డీయేతో తెలుగుదేశం పార్టీ తెగతెంపులు చేసుకున్నప్పటి నుంచి ఏపీలోని కొంత మంది మంత్రులు..అధికారుల్లో కంటి మీద కునుకు కరవైంది. ఎప్పుడు ఎటువైపు నుంచి తమపై దాడి మొదలవుతుందో అన్న టెన్షన్ వారిలో నెలకొంది. ఏపీకి చెందిన నలుగురు కీలక మంత్రులకు సంబంధించిన అవినీతి చిట్టాను కేంద్రం సిద్ధం చేసినట్లు సమాచారం. ఇప్పటికే కొంత మంది ఐఏఎస్ అధికారుల వ్యవహారాలను ఢిల్లీ పెద్దలు రెడీ చేసిపెట్టుకున్నారు. ఏ క్షణంలో అయినా వీరిపై చర్యలు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే పక్కా ఆధారాలతో ముందుకు సాగటానికి కేంద్రం రెడీ అవుతోందని ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి. ఏపీకి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఏపీ ప్రభుత్వంలో జరుగుతున్న వ్యవహారాలు అన్నీ ఢిల్లీలో కీలకంగా ఉన్న ఓ నేతకు పూసగుచ్చినట్లు నివేదించినట్లు సమాచారం. అన్ని వివరాలు అందజేసినందుకు గాను ‘దాడి’ నుంచి తనను మినహాయించాలని ఆయన కోరుకున్నట్లు ఓ అధికారి తెలిపారు. ఎందుకంటే ఆయనది కూడా ప్రభుత్వంలో చాలా కీలక పాత్రే. ఇక మంత్రుల విషయానికి వస్తే ఏపీ ప్రభుత్వంలో అవినీతి భారీ స్థాయిలో ఉన్న శాఖలు ఏవో ఆ మంత్రులకు సంబంధించి చిక్కులు తప్పవని చెబుతున్నారు.

సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే తనపై కోపంపై ఇతరులపై దాడి చేసే అవకాశం ఉందని..దేనికైనా రెడీగా ఉండాలంటూ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఎందుకంటే ఏపీ ప్రభుత్వంలో సాగిన అడ్డగోలు వ్యవహారాలన్నీ చంద్రబాబుకు మించి మరెవరికీ తెలియవు కదా? అని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ఈ ఏప్రిల్, మే నెలల్లో రాజకీయంగా ఏపీలో ఎన్ని సంచలనాలు నమోదు అవుతాయో వేచిచూడాల్సిందే. కేంద్రం ఎవరిని లక్ష్యంగా చేసుకున్నా..తాము హోదా అడుగుతున్నందునే ఇలా చేస్తున్నారని చెప్పుకునేందుకు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అనే సంగతి మర్చిపోయి ప్రతిపక్ష నేతలా వ్యవహరిస్తున్నారని ఓ ఉన్నతాధికారి తెలిపారు. అందులో భాగమే ప్రధాని మోడీ ఇంటి ముందు ధర్నా వంటి కీలక నిర్ణయాలు అని విశ్లేషించారు.

Next Story
Share it