Telugu Gateway
Telugugateway Exclusives

మూడేళ్ళలో కార్పొరేట్లకు 2.41 లక్షల కోట్ల రుణాలు మాఫీ!

మూడేళ్ళలో కార్పొరేట్లకు 2.41 లక్షల కోట్ల రుణాలు మాఫీ!
X

దేశ బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించి వరస పెట్టి షాకింగ్ వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే విజయ్ మాల్యా తొమ్మిదివేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి దేశం దాటగా...కొత్తగా నీరవ్ మోడీ ఓ 12 వేల కోట్లు ఎగ్గొట్టి ఎంచక్కా చెక్కేశారు. ఇప్పుడు పార్లమెంట్ సాక్షిగా సర్కారు ఇఛ్చిన సమాధానం మరింత షాక్ కు గురిచేసేది ఉంది. గత మూడేళ్ల కాలంలోనే దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు కార్పొరేట్లకు చెందిన 2.41 లక్షల కోట్ల రూపాయల రుణాలను రైట్ ఆఫ్ చేసినట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని

కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి శివప్రతాప్ శుక్లా మంగళవారం రాజ్యసభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు. 2014, ఏప్రిల్ నుంచి సెప్టెంబర్, 2017 మధ్య ఈ రుణాలను రద్దు చేశాయని మంత్రి తెలిపారు. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ (నిరర్ధక ఆస్తులు) లేదా వసూలు కాని రుణాలను ప్రతి ఏటా బ్యాంకులు తమ బ్యాలెన్స్ షీట్‌ను తొలగించడం సాధారణ ప్రక్రియే అని శుక్లా రాజ్యసభలో చెప్పారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఈ మూడేళ్లలో 2,41,911కోట్ల రూపాయల రుణాలను రద్దు చేశాయని వెల్లడించారు.

అయితే లోన్లను బ్యాలెన్స్ షీట్ నుంచి తొలగించినంత మాత్రాన రుణాలు తీసుకున్నవారిని వదిలేది లేదని.. ఈ నిర్ణయం రుణ గ్రహీతలకు లాభించదంటూ మంత్రి తెలిపారు. అంతేకాదు నిబంధనల ప్రకారం రుణాలు తీసుకున్నవారి వివరాలను ప్రకటించలేమని వెల్లడించారు. ఇప్పటికే రుణాలు వసూలు చేయడానికి బ్యాంకులు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాయని శుక్లా తెలిపారు. మూడేళ్లలో ఇంత పెద్ద మొత్తంలో రుణాలు రద్దు చేయడంపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఫేస్‌బుక్‌ పోస్ట్‌ లో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ లెక్కలు తనను షాక్‌కు గురిచేశాయంటూ దుయ్యబట్టారు. ఓవైపు రుణాలు అందక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతు రుణాలను రద్దు చేయాలని ఎన్ని విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం పట్టించుకోక పోగా బడాబాబులు తీసుకున్న రుణాలను రద్దు చేస్తారా అంటూ విమర్శించారు. పైగా ఈ రుణాలు ఎవరు తీసుకున్నారన్న విషయాన్ని కూడా మంత్రి చెప్పకపోవడంపై మండిపడిన మమతా అసలు ఇదే అతి పెద్ద కుంభకోణం కాదా అని ప్రశ్నించారు. పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వారి వివరాలు ఇవ్వడం కుదరదని పార్లమెంట్‌లోనే ప్రభుత్వం చెప్పడం దారుణమని...కచ్చితంగా ఆ వివరాలు వెల్లడించాలని ఆమె డిమాండ్‌ చేశారు.

Next Story
Share it