Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు అయితే బొకే ఇచ్చి....భోజనం పెట్టేవారా!

చంద్రబాబు అయితే బొకే ఇచ్చి....భోజనం పెట్టేవారా!
X

ఇదీ తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి తీరుపై అధికార వర్గాల్లో చర్చ. ఏపీకి ప్రత్యేక హోదా కావాలనే డిమాండ్ తో విభేదించేవారెవరూ లేరు. కాకపోతే ఇంత కాలం రకరకాల మాటలు మార్చి..ఇప్పుడు అందరి మార్గంలోకి వచ్చింది చంద్రబాబునాయుడే. ఢిల్లీలో దేశ ప్రధాని నరేంద్రమోడీ ఇంటి ముందు శాంతియుతంగా ధర్నా చేయటం కూడా కాసేపు సమంజసమే అనుకుందాం. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా...అదీ చట్ట సభ సభ్యులు ప్రధాని ఇంటి ముందు ధర్నాకు వెళితే భద్రతా సిబ్బంది అక్కడ నుంచి బలవంతంగా తరలించకుండా ఉంటారా?. అదే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఇంటి ముందు ఎవరైనా ధర్నా చేస్తే..బాగా చేశారు అని లోపలికి పిలిపి..బొకే ఇచ్చి..భోజనం పెట్టి పంపిస్తారా ఆందోళనకారులను. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ ఉద్యమం సమయంలో అమాయకులను తుపాకులతో కాల్చి చంపి..డ్వాక్రా మహిళలను గుర్రాలతో తొక్కించిన చరిత్రను అందరూ మర్చిపోయారు అనుకుంటున్నారు చంద్రబాబు. అన్నింటి కంటే దారుణం ఏమిటంటే ఢిల్లీలో ఎంపీల అరెస్టుపై చంద్రబాబు స్పందన దారుణంగా ఉందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

‘ప్రధాని ఇంటి ముందు నిరసన చేస్తున్న వారిని అరెస్టు చేయటం దుర్మార్గ చర్య అట. కేంద్ర ప్రభుత్వ దమన నీతికి ఇది పరాకాష్ట అట. కేంద్రం అమానవీయంగా వ్యవహరిస్తుందట.’ ఇవీ చంద్రబాబు వ్యాఖ్యలు. ఏపీలో అన్ని పార్టీల విశ్వసనీయత కోల్పోయిన చంద్రబాబు చివరకు ప్రభుత్వ ఉద్యోగులను తన రాజకీయ పోరాటాలకు వాడుకోవటం దారుణమని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. కేంద్రంతో పోరాటం రాజకీయంగా చంద్రబాబు చేయాలి కానీ...ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చేయటం వల్ల పని నష్టం, ప్రజలకు అసౌర్యం తప్ప..ప్రయోజనం ఏముంటుందని ఆయన ప్రశ్నించారు.

Next Story
Share it