Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు అనే నేను...ఏపీ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కల చెరిపేశాను

చంద్రబాబు అనే నేను...ఏపీ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కల చెరిపేశాను
X

ఆంధ్రప్రదేశ్ కు ప్రస్తుతం అత్యంత కీలకమైన గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయ ప్రాజెక్టు అటకెక్కినట్లేనా?. అంటే అవుననే అంటున్నాయి మౌలికసదుపాయాల శాఖ వర్గాలు. కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి స్వార్ధం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టును అడ్డుకుంది. నిజంగా చంద్రబాబు ఈ ప్రాజెక్టుకు అడ్డుపడి ఉండకపోతే..ఇఫ్పటికే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులో మొదలు అయ్యేవేనని అధికార వర్గాలు చెబుతున్నాయి. నిత్యం అభివృద్ధి కోసం తపిస్తానని...రాష్ట్రంలో తన అంత విజనరీ లేరని చెప్పుకునే చంద్రబాబు...కేంద్రం అన్ని అనుమతులు ఇఛ్చిన ప్రాజెక్టు గొంతు ఎందుకు నులిమేసినట్లు?. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా చేస్తారని ఎవరైనా నమ్ముతారా?. కానీ చంద్రబాబు చేసి చూపించారు మరి. ప్రస్తుతం ఏపీలో ఉన్న విమానాశ్రయాల్లో సౌకర్యాలు అంతంత మాత్రమే. తిరుపతి, విజయవాడ తదితర విమానాశ్రయాల్లో కొత్త టెర్మినల్స్ కట్టినా...రన్ వే ల విస్తరణ...భవిష్యత్ ట్రాఫిక్ అవసరాలకు ఏ మాత్రం సరిపోదు. ఈ తరుణంలో ఏపీకి గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం అనేది తక్షణావసరం.

ప్రభుత్వ, ప్రైవేట్, భాగస్వామ్య (పీపీపీ) విధానం కింద ఈ ప్రాజెక్టు కోసం టెండర్లు కూడా పిలిచారు. భారత ప్రభుత్వానికి చెందిన ఎయిర్ పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), ప్రైవేట్ రంగంలోని ప్రముఖ సంస్థ జీఎంఆర్ లు బరిలో నిలిచాయి. టెండర్ ఏఏఐకి దక్కింది. అక్కడే అసలు సమస్య వచ్చింది. చంద్రబాబు తాను అనుకున్న ప్రైవేట్ సంస్థకు కాకుండా...ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఏఏఐకు టెండర్ పోవటంతో సీఎం చంద్రబాబులోని అసలు మనిషి బయటకు వచ్చారు. అరే టెండర్ ఇలా కాదు..కొత్తగా ఏరో సిటీతోపాటు...ఎంఆర్ వో సౌకర్యం కూడా జత చేసి మళ్లీ టెండర్ పిలుస్తాం అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. అధికారుల సిఫారసులను బేఖాతరు చేసి మరీ... చంద్రబాబు భోగాపురం విమానాశ్రయం టెండర్ ను రద్దు చేసి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు ప్రాజెక్టుకు బ్రేకులు వేశారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు టేకాఫ్ అయ్యే అవకాశమేలేదని..ఎన్నికలు జరిగి..కొత్త ప్రభుత్వం వస్తే తప్ప..ఈ ప్రాజెక్టు ముందుకు సాగదని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీంతో స్వయంగా ముఖ్యమంత్రి గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ప్రాజెక్టుకు అడ్డుపడినట్లు అయిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

Next Story
Share it