Telugu Gateway
Andhra Pradesh

‘స్కాంబాబు’గా మారిన చంద్రబాబు

‘స్కాంబాబు’గా మారిన చంద్రబాబు
X

ప్రతి స్కీమ్ లోనూ స్కామే. ప్రతి కాంట్రాక్ట్ లోనూ ‘కమిషన్లే’. అసలు టెండర్ల వ్యవస్థే ప్రహసనంగా మారుతోంది. ఏ పని ఎవరికి ఇవ్వాలో ముందే నిర్ణయం అయిపోతుంది. గతంలో కాంట్రాక్ట్ దక్కించుకున్న వారి నుంచి ప్రభుత్వంలో ఉండేవారు కమిషన్లు తీసుకునేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. అసలు కాంట్రాక్ట్ ఎవరికి ఇవ్వాలో ప్రభుత్వ పెద్దలే ముందే నిర్ణయిస్తున్నారు. కాంట్రాక్టర్ల ‘సిండికేట్’ కావటం..కమిషన్లు కొత్తగా వచ్చిందేమీ కాదు. కాకపోతే గతంలో ఈ పనులు ఇంజనీర్లు..ఇతరులు చేసేవారు. కాకపోతే ఇక్కడ ఏకంగా ప్రభుత్వంలోని పెద్దలే చేస్తున్నారు. అదీ తేడా అంటే. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ ఏపీలో రాజకీయంగా నామరూపాల్లేకుండా పోతే...ఇప్పటికీ కాంగ్రెస్ ను తిట్టిపోసే చంద్రబాబు మాత్రం ఈ విభజనను ‘ ఓ అద్భుత అవకాశం’గా మార్చుకుని దోపిడీ డిజైన్లు చేసుకుంటున్నారు. సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకుంటా అని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. నిజంగా ఈ విభజన సంక్షోభం ‘చంద్రబాబు దోపిడీ’కీ ఓ మాంచి అవకాశంగా మారిందని ఓ అధికారి వ్యాఖ్యానించారు.

అమరావతిలో రహదారుల పనుల్లోనూ జాతీయ రహదారుల రేట్ల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ధరలతో భారీ స్కామ్ కు కొత్తగా రూపకల్పన చేశారు. ఒక్క రహదారులేంటి? అమరావతిలో నిర్మించే నివాస సముదాయాల విషయంలోనూ ఇదే దందా. టెండర్ టెండర్ కూ రేట్లు మారుస్తూ సర్కారు పెద్దలు భారీ ఎత్తున దోపిడీకి ‘స్కెచ్’ వేశారు. తాజాగా హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ రాజధాని ప్రకటనకు ముందు నూతన రాజధాని ప్రాంతంలో 14 ఎకరాల భూములను కారుచౌకగా దక్కించుకున్న అంశం వెలుగులోకి వచ్చింది. ఇక ప్రభుత్వ పెద్దల బినామీల దందా అయితే వేల ఎకరాల్లో ఉన్న విషయం తెలిసిందే. నూతన రాజధాని ప్రాంతంలో ‘ఇన్ సైడర్ ట్రేడింగ్’ జరిగిందనే విషయాన్ని తొలుత వెలుగులోకి తెచ్చింది తెలుగు గేట్ వేనే.

విశాఖపట్నంలో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఇన్నోవా సొల్యూషన్స్ కు భూ కేటాయింపుల దగ్గర నుంచి అన్నింట్లోనూ స్కామ్ లే. అమరావతిలో మొక్కల పెంపకంలోనూ అంతర్జాతీయ ప్రమాణాల పేరుతో కోట్లు కొట్టేశారు. ఇక పట్టిసీమ, పోలవరం, సాగునీటి ప్రాజెక్టుల్లో కుంభకోణాల గురించి అయితే చెప్పుకోవాల్సిన పనేలేదు. నీరు-చెట్టు పేరుతోనూ వేల కోట్ల రూపాయలను దుర్వినియోగం చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపితే అసలు రంగు బయటపడుతుందని అధికారులే చెబుతున్నారు. తాత్కాలిక సచివాలయం నిర్మాణంలో సర్కారే భారీ స్కామ్ కే తెగపడింది. ఇలా ప్రభుత్వంలో పది కోట్ల రూపాయల పైబడిన ఎలాంటి పని అయినా సరే..అన్ని పెద్దల కనుసన్నల్లోనే సాగుతున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. చివరకు చంద్రబాబు..‘స్కామ్’బాబుగా మారిపోయారనే విమర్శలు విన్పిస్తున్నాయి.

Next Story
Share it