Telugu Gateway
Telangana

తెలుగు ఛానళ్లలో కాస్టింగ్ కౌచ్ మాటేమిటి!

తెలుగు ఛానళ్లలో కాస్టింగ్ కౌచ్ మాటేమిటి!
X

కాస్టింగ్ కౌచ్. ఈ మధ్య ట్రెండింగ్ టాపిక్ ఇది. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల వరకూ పెద్దగా పట్టించుకోని అంశం ఇది. కానీ శ్రీరెడ్డి అనే నటి లేవనెత్తిన దుమారం ఎటునుంచి ఎటువైపో మళ్ళుతోంది. తాజాగా సినిమా పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇది పరిశ్రమలో ఎప్పటి నుంచో ఉన్నా ఈ మధ్యే కాస్టింగ్ కౌచ్ అంశంపై దుమారం మొదలైంది. రాజకీయాలు...సినిమాలు పెద్ద విభిన్నమైన అంశాలు ఏమీ కావు. ఎవరైనా నువు తప్పు చేశావు అంటే...అది నిజమేనా?. మనం దిద్దుకోవాల్సిన అంశం ఏమైనా ఉందా? అనే కోణంలో చూడటం అన్ని రంగాల్లోనూ మానేశారు. తప్పు చేసింది నేను ఒక్కడినేనా?. నువ్వు చేయాలేదా? అని ఎదురుదాడి చేస్తే లెక్క సరిపోతుంది. అది రాజకీయాల్లో అయినా...సినిమాల్లో అయినా పరిస్థితి అంతే. తెలుగులో కొన్ని ఛానళ్ళు కాస్టింగ్ కౌచ్ అంశాన్ని 24x7 అంశంగా మార్చేయటంతో సినీ పరిశ్రమలోని కొంత మంది తీవ్రంగా స్పందించారు.

ఇఫ్పుడు పరిశ్రమలోని కొంత మంది కొన్ని తెలుగు ఛానళ్లలోని కాస్టింగ్ కౌచ్ అంశంపై దృష్టి సారించారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఛానళ్ళలో అవకాశాలు కల్పించే విషయంలో కొన్ని తెలుగు ఛానళ్ళలో కూడా ఇదే ట్రెండ్ నెలకొందనే సమాచారం సేకరించారు. ఇందులో కొన్ని చోట్ల ఏకంగా యాజమాన్యాలే భాగస్వాములు అయిన సమాచారం సేకరించినట్లు పరిశ్రమకు చెందిన ప్రముఖుడు ఒకరు తెలిపారు. ఎవరెవరి జాతకాలు ఏమిటో తమకు తెలుసని...సినీ పరిశ్రమ కంటే ఎక్కువ అరాచకాలు కొన్ని ఛానళ్లలో జరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. త్వరలోనే ఈ అంశాలు అన్నీ కూడా ఆధారాలతో సహా వెలుగులోకి వస్తాయని ఆయన అన్నారు. చూడబోతుంటే..ఈ వ్యవహారం అటు మీడియా..ఇటు సినీ పరిశ్రమ మధ్య మరింత గ్యాప్ పెంచేలా కన్పిస్తోంది. తమకున్న సమాచారం ప్రకారం ఈ వ్యవహారంలో పెద్ద తలకాయలే బయటకు వస్తాయని సినీ రంగానికి చెందిన వారు చెబుతున్నారు.

Next Story
Share it