Telugu Gateway
Telangana

టీఆర్ఎస్ కీలక నిర్ణయం

టీఆర్ఎస్ కీలక నిర్ణయం
X

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) సోమవారం నాడు కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం నాడు లోక్ సభలో పోడియం వద్దకు పోరాదని..కేవలం సీట్ల దగ్గర నుంచే నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇక ఒక్క అన్నాడీఎంకె ఎలా వ్యవహరిస్తుంది అన్నది మాత్రమే తేలాల్సి ఉంది. టీఆర్ఎస్ నిర్ణయంతో లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ కు మార్గం సుగమం అయ్యే అవకాశం కన్పిస్తోంది. ఇప్పటికే టీడీపీ, వైసీపీకి తోడుకాంగ్రెస్ కూడా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా...సీపీఎం కూడా ఆ దిశగా ముందుకు సాగనుంది. దీంతో లోక్ సభలో అవిశ్వాసం తప్పక చర్చకు రావాల్సిన పరిస్థితి కన్పించబోతోంది. లోక్ సభలో టీఆర్ఎస్ అనుసరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఓ పది నిమిషాలు సహకరిస్తే అవిశ్వాసం చర్చకు వస్తుందని..కానీ మోడీ సర్కారును అవిశ్వాస గండం నుంచి గట్టేక్కేందుకే టీఆర్ఎస్ ఇలా వ్యవహరిస్తుందనే విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆ పార్టీ ఇప్పుడు స్టాండ్ మార్చుకుంది.

అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందిందే.. ఆ సందర్భంగా జరిగే చర్చలో పాల్గొనాలని టిఆర్ఎస్ నిర్ణయించింది. రిజర్వేషన్ల ఓటింగ్ విషయంలో మాత్రం టిఆర్ఎస్ కు ఇంకా క్లారిటీ రాలేదు. అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం తర్వాత మీడియాతో ఢిల్లీలో ఎంపీలు కేకే, జితేందర్ రెడ్డి, వినోద్ కుమార్, కవిత మాట్లాడారు. తాము ఎపి ప్రత్యేక హోదాకు అడ్డుపడుతున్నామన్న ఆరోపణలను ఖండించారు. ఎపి కి కేంద్ర సర్కారు ఇచ్చిన హామీల అమలు చేయాలని తామూ కోరుతున్నామని వివరించారు. ఆ అంశంలో ఆంధ్రా నేతల కంటే బాగా మేమే మాట్లాడగలం అని స్పష్టం చేశారు. తమపై బురద చల్లే ప్రయత్నం మానుకోవాలని సూచించారు. ఎపి నేతల మాటలు తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఆందోళనను సాకుగా చూపి కేంద్రం సభను వాయిదా వేస్తోందని విమర్శించారు. కొందరు దుర్మార్గులు పనిగట్టుకుని తమపై దుష్ప్రచారం చేస్తున్నట్లు అవిశ్వాసాన్ని తామేమీ అడ్డుకోవడంలేదన్నారు.

Next Story
Share it