Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో ‘ఒంటరైన’ చంద్రబాబు

ఏపీలో ‘ఒంటరైన’ చంద్రబాబు
X

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ లో ఒంటరి అయిపోయారు. వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభావం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీపై ఉండటం ఖాయంగా కన్పిస్తోంది. నిన్నమొన్నటివరకూ బిజెపితో పొత్తు సాగింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీనే బిజెపితో పొత్తుకు రాం రాం చెప్పేసింది. గత ఎన్నికల్లో టీడీపీ బిజెపితోపాటు..పవన్ కళ్యాణ్ తో కలసి ముందుకు సాగింది. అప్పట్లో మోడీపై ఉన్న సానుకూల ఇమేజ్ తోపాటు..పవన్ కళ్యాణ్ గ్లామర్ కూడా టీడీపీ గెలుపునకు దోహదపడ్డాయి. ఇప్పుడు ఆ విషయాన్ని తెలుగుదేశం నేతలు అంగీకరించకపోయినా..అసలు విషయం ఏమిటో వారు అంతరాత్మలకు అయితే తెలుసు. కానీ ఈ సారి తెలుగుదేశం పార్టీ మరి ఏపీలో ఒంటరిగా బరిలో నిలవాల్సిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ తో పొత్తు ఉంటుందని అనుకున్నా....తాజాగా పవన్ ఎవరూ ఊహించని రీతిలో చంద్రబాబు, లోకేష్ పై తీవ్ర విమర్శలు చేయటంతో చంద్రబాబుతోపాటు టీడీపీ శ్రేణులు షాక్ కు గురయ్యాయి. వామపక్షాలతో కలసి ముందుకు సాగేందుకు పవన్ రెడీ అయిపోతున్నారు. మరి ఇక టీడీపీతో కలిసేందుకు ఏపీలో ఎవరున్నారు? అంటే ఎవరూ లేరనే చెప్పొచ్చు.

రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్ తో పొత్తు అంటే అది తెలుగుదేశం పార్టీకి ఆత్మహత్యా సదృశ్యమే అవుతుంది. దాదాపు నాలుగేళ్ళ పాటు బిజెపితో కలసి..ప్రభుత్వంలో భాగస్వామిగా చేరి రాష్ట్రానికి అదనపు ప్రయోజనం చేకూర్చిపెట్టడం సంగతి అలా ఉంచి..చట్టబద్దంగా రావాల్సిన వాటిని సాధించటంలో కూడా అధికార టీడీపీ ఘోరంగా విఫలమైంది. ఎవరెన్ని విమర్శలు చేసినా..కేంద్రంతో సఖ్యతతో ఉండే సాధిస్తామని చివరి నిమిషం వరకూ చంద్రబాబు నమ్మబలికారు. కానీ ఏమీ చేయలేకపోయారు. ఈ ప్రభావం ఖచ్చితంగా టీడీపీపై ఉండటం ఖాయం. నాలుగేళ్ల పాటు కలసి ఉండి...అటు కేంద్రంలో..ఇటు రాష్ట్ర ప్రభుత్వాల్లో భాగస్వాములుగా ఉండి ఏమీ సాధించలేకపోవటం అనేది చంద్రబాబు ఫెయిల్యూర్ గానే నిలుస్తుంది.

మోడీ సర్కారుపై టీడీపీ అవిశ్వాసం అనగానే ఢిల్లీలో పలు పార్టీలు మద్దతు ప్రకటించాయి. దీనికి ప్రధాన కారణం చంద్రబాబుపై ఉన్న ప్రేమ కంటే మోడీపై వాళ్లకు ఉన్న కసి ప్రధాన కారణం అన్న సంగతి తెలిసిందే. రాజకీయంగా అత్యంత కీలకం అయిన ఆంధ్రప్రదేశ్ క్షేత్రంలో ఒంటరి అయిన చంద్రబాబు..ఢిల్లీలో ఎంత మంది మిత్రులను సాధించుకుంటే ఏమిటి?. దాని వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా?. ముందు ఇక్కడ గెలవాలి కదా?. ఈ నాలుగేళ్లలో అత్యంత కీలకమైన రాజధాని అడుగు ముందుకు పడలేదు. ఇది చంద్రబాబు ఖాతాలో పెద్ద వైఫల్యంగా నిలవబోతుంది. రుణ మాఫీ కూడా చెప్పింది ఒకటి..చేసింది ఒకటి. దీనికితోడు ఏపీలో భారీగా పెరిగిపోయిన అవినీతి. ఇవన్నీ కూడా వచ్చే ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపించబోయే అంశాలుగా ఉన్నాయి. చూడాలి మరి చంద్రబాబు ‘ఒంటరి’ పోరాటం ఏ మేరకు ఫలితాన్ని ఇస్తుందో?.

Next Story
Share it