Telugu Gateway
Telangana

చిక్కుల్లో పడిన తెలంగాణ సర్కారు

చిక్కుల్లో పడిన తెలంగాణ సర్కారు
X

తెలంగాణ సర్కారు చిక్కుల్లో పడింది. సిరిసిల్ల మునిసిపల్ మాజీ ఛైర్ పర్సన్ సామల పావని మీడియా సాక్షిగా వెల్లడించిన ‘కమిషన్ల’ వ్యవహారం తెలంగాణలో పెద్ద దుమారమే రేపుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ పలుమార్లు అసెంబ్లీ సాక్షిగా అవినీతిని సహించేదిలేదని..తాము కడుపుకట్టుకుని..ఎలాంటి అవినీతికి ఛాన్స్ లేకుండా పనిచేస్తున్నామని ప్రకటించారు. అయితే ఆయన ప్రకటనకు భిన్నంగా స్వయంగా సీఎం కెసీఆర్ తనయుడు, మంత్రి కెటీఆర్ నియోజకవర్గానికి చెందిన మాజీ మునిసిపల్ ఛైర్ పర్సన్ పావని చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని తీవ్ర ఇరకాటంలో పడేశాయి. మంత్రి కెటీఆర్ కు కూడా ఈ విషయం తెలుసని..ఈ కమిషన్ల వ్యవహారం రాష్ట్రమంతటా ఉందని పావని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. దీంతో ఇరకాటంలో పడిన సర్కారు వెంటనే ఆమెను పదవి నుంచి తప్పించింది. విపక్షాలు ఇఫ్పటికే మిషన్ భగరధ నుంచి మొదలుకుని సాగునీటి ప్రాజెక్టులు,,విద్యుత్ ప్రాజెక్టుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. వారి ఆరోపణలకు పావని వ్యాఖ్యలు మరింత బలం చేకూర్చిపెట్టాయి. దీన్ని ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ ఓ అస్త్రంగా వాడుకునేందుకు రెడీ అయింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఈ అంశంపై పలు ప్రశ్నలు లేవనెత్తారు. కేటీఆర్‌ అవినీతికి సంబంధించి సాక్ష్యాలు కూడా దొరికినా ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదో సీఎం కేసీఆర్‌ చెప్పాలని శ్రవణ్ డిమాండ్ చేశారు.

దళితుడైన మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య అవినీతికి పాల్పడ్డారంటూ.. ఏం చేశారో కూడా చెప్పకుండానే పదవి నుంచి తొలగించారని పేర్కొన్నారు. రాజయ్యకో నీతి, మంత్రి కేటీఆర్‌కు మరో నీతి వర్తింపజేస్తారా? కేటీఆర్‌పై చర్య తీసుకోకపోవడానికి కొడుకు కావడమే కారణమా? అని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్‌ను కేబినెట్‌ నుంచి బర్తరఫ్‌ చేయాలని, ఆయన అవినీతిపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని ఆదివారం ఒక ప్రకటనలో శ్రావణ్‌ డిమాండ్‌ చేశారు. మంత్రి కేటీఆర్‌ సొంత నియోజకవర్గమైన సిరిసిల్లలో వెలుగుచూసిన అవినీతి.. రాష్ట్రంలో భారీగా జరుగుతున్న అవినీతికి మచ్చుతునక అని పేర్కొన్నారు. రాజీనామా చేసిన మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పావని.. మీడియా ప్రతినిధుల ఎదుట మాట్లాడిన మాటల్లో అనేక వాస్తవాలు ఉన్నాయన్నారు. తన గుట్టురట్టవుతున్న విషయాన్ని గుర్తించిన కేటీఆర్‌.. ఆమెతో పదవికి రాజీనామా చేయించారని ఆరోపించారు. కమీషన్లు తీసుకోవాలని కౌన్సిలర్లు, చైర్‌పర్సన్‌లకు సూచించిన కేటీఆర్‌.. తనవంతు పర్సంటేజీలను తీసుకోకుండా ఉంటారని ఎలా నమ్మమంటారో చెప్పాలన్నారు. ఈ పర్సంటేజీల వ్యవహారం మంత్రి కనుసన్నల్లోనే జరుగుతోందనే విషయం కూడా పావని బయటపెట్టినా సీఎం పట్టించుకోవడంలేదన్నారు. ఈ వ్యవహారంపై తాను ఏసీబీకి ఫిర్యాదు చేస్తానని తెలిపారు.

Next Story
Share it