Telugu Gateway
Telangana

తెలంగాణ మండలి ఛైర్మన్ కంటికి గాయం

తెలంగాణ మండలి ఛైర్మన్ కంటికి గాయం
X

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలిరోజే రచ్చ రచ్చతో మొదలయ్యాయి. కాంగ్రెస్ సీనియర్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గవర్నర్ ప్రసంగ సమయంలో హెడ్ ఫోన్స్ ను పోడియం వైపు విసిరేశారు. అవి మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ కు తగిలాయి. దీంతో స్వామిగౌడ్ కంటికి స్వల్పగాయం అయింది. వెంటనే ఆయనను సరోజనినీ దేవి కంటి ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. కోమటిరెడ్డి హెడ్‌ సెట్‌ విసిరేసిన దృశ్యాలు అసెంబ్లీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ వ్యవహారంపై అధికార టీఆర్ఎస్ సీరియస్ అయింది. కోమటిరెడ్డిపై చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి తీరును తీవ్రంగా తప్పుపట్టారు. అయితే ఈ వ్యవహారంపై కోమటిరెడ్డి కూడా స్పందించారు. గవర్నర్‌ ప్రసంగంలో రైతు సమస్యల గురించి మాట మాత్రమైనా స్పందించకపోవడంపై తాము ఆందోళన చేశామని, అయితే, కొంత ఆవేశానికి గురైనమాట వాస్తవమేనని ఒప్పుకున్నారు.

‘‘విపక్ష సభ్యులుగా మా నిరసన తెలియజెప్పడానికి స్పీకర్‌ పోడియం దగ్గరికి వెళ్లాం. కానీ మార్షల్స్‌ మాకు అడ్డుతగిలారు. గలాటాలో మార్షల్స్‌ నన్ను కూడా తన్నారు. నా కాలికి గాయమైంది. ఎక్స్‌ రే కూడా తీయించుకున్నాను. అయినా, మమ్మల్ని పోడియం వద్దకు వెళ్లకుండా అడ్డుకునే హక్కు ప్రభుత్వానికి ఎవరిచ్చారు? పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీలు ప్రతిరోజూ స్పీకర్‌ పోడియం దగ్గరికి వెళుతున్నారుకదా, మరి ఇక్కడ మాత్రం నిర్బంధాలు ఎందుకు?’ అని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.

Next Story
Share it