Telugu Gateway
Telangana

మూకుమ్మడి రాజీనామాల దిశగా కాంగ్రెస్

తెలంగాణ కాంగ్రెస్ కఠిన నిర్ణయానికి సిద్దమైంది. మూకుమ్మడి రాజీనామాలు చేయటం ద్వారా టీఆర్ఎస్ సర్కారుపై పోరును మరింత పెంచాలని నిర్ణయించింది. అయితే అధిష్టానం ఆమోదం లభించిన తర్వాతే దీనిపై ముందుకు సాగాలని నిర్ణయించారు. అయితే రాజీనామాలకు మాత్రం ఇప్పటికే సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల సభ్యత్వాన్ని రద్దు చేయటంతో..మిగిలిన సభ్యులను బడ్జెట్ సమావేశాల మొత్తానికి సస్పెండ్ చేసిన తీరుపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ‘ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తున్నది. ఏ నిబంధన ప్రకారం మా సభ్యుల సభ్యత్వాలు రద్దు చేస్తారు?

ఏం తప్పు చేశామని సస్సెన్షన్‌ విధించారు? కనీసం వివరణ తీసుకోకుండా ఇంత తీవ్ర నిర్ణయం తీసుకుంటారా? ఇక మీతో మాట్లాడి ప్రయోజనం లేదు. ప్రజాక్షేత్రంలోనే అమీతుమీ తేల్చుకుంటాం..’ అని కాంగ్రెస్‌ పక్షనేత జానా రెడ్డి అన్నారు. సభ నుంచి సస్పెండ్ అయిన తర్వాత సీఎల్పీ సమావేశం జరిగింది. ఇందులోనే రాజీనామాల ప్రతిపాదన వచ్చింది. మంగళవారం శాసన సభ ప్రారంభమైన వెంటనే 11 మంది ఎమ్మెల్యేలపై వేటు వేయాలన్న తీర్మానాన్ని సభ ఆమోదించింది. మెజారిటీ ఎమ్మెల్యేలు ‘‘వాళ్లు సస్పెండ్‌ చెయ్యడం కాదు.. మనమే మూకుమ్మడి రాజీనామాలు చేద్దాం..’ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ఢిల్లీ అధిష్టానానికి కూడా తెలియజేశామని, అక్కడి నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రాగానే రాజీనామాల ప్రకటనకు సిద్ధమైనట్లు తెలిసింది.

Next Story
Share it