Telugu Gateway
Telangana

తెలంగాణ అసెంబ్లీ సంచలన నిర్ణయం

తెలంగాణ అసెంబ్లీ సంచలన నిర్ణయం
X

తెలంగాణ అసెంబ్లీ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర చరిత్రలో తొలిసారి ఇద్దరు సభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. సోమవారం నాడు అసెంబ్లీలో జరిగిన పరిణామాలే దీనికి కారణం అయ్యాయి. కాంగ్రెస్ సీనియర్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెడ్ ఫోన్స్ ను విసిరేయటం..అవి మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ కు తగిలాయని సర్కారు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఘటనకు గాను ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ లను సభ నుంచి సస్పెండ్ చేశారు. ఈ ఘటన జరిగినప్పటి నుంచే అధికార టీఆర్ఎస్ కఠిన చర్యలు తప్పవనే సంకేతాలు ఇచ్చింది. ముఖ్యంగా కోమటిరెడ్డిపై చర్యలు ఉంటాయని అనుకున్నారు. ఇప్పుడు సంపత్ కుమార్ కూడా చర్యల జాబితాలో చేరారు. వీరిద్దరి సభ్యత్వాన్ని రద్దు చేసిన అసెంబ్లీ..మిగిలిన కాంగ్రెస్ సభ్యులను ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకూ సస్పెండ్ చేశారు. దీంతో కాంగ్రెస్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. సస్పెండ్ అయిన వారిలో ప్రతిపక్ష నేత జానారెడ్డి, ఉపనేత జీవన్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్‌ ఉత్తం కుమార్‌రెడ్డి, గీతారెడ్డి, చిన్నారెడ్డి, డీకే అరుణ, భట్టి విక్రమార్క, రామ్మోహన్‌రెడ్డి, వంశీచంద్‌రెడ్డి, పద్మావతిరెడ్డి, మాధవరెడ్డి తదితరులు ఉన్నారు.

సభా కార్యక్రమాలు ప్రారంభం అయిన వెంటనే తెలంగాణ శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంతప్ కుమార్ ల సభ్యత్వాన్ని రద్దు చేస్తూ మరో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రెండు తీర్మానాలను సభ ఆమోదించటంతో కాంగ్రెస్ సభ్యులు కొద్దిసేపు నిరసనల తర్వాత బయటకు వెళ్లిపోయారు. మండలిలోనూ కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేశారు. అయితే సభలో హుందాగా ఉండే ప్రతిపక్ష నేత జానారెడ్డిని సస్పెండ్ చేయటాన్ని బిజెపి నేత కిషన్ రెడ్డి తప్పుపట్టారు. భవిష్యత్ లో సస్పెన్షన్లు చేసేటప్పుడు శాసనసభాపక్ష నేతల అభిప్రాయాలు తీసుకోవాలని ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ కోరారు. అయితే సభ నిర్ణయాలను ఆయన సమర్థించారు.

Next Story
Share it