Telugu Gateway
Telangana

తెలంగాణ ‘ప్రైవేట్ వర్శిటీల బిల్లుకు ఆమోదం

తెలంగాణ ‘ప్రైవేట్ వర్శిటీల బిల్లుకు ఆమోదం
X

తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు రాబోతున్నాయి. ఇందుకోసం ప్రతిపాదించిన ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లుకు బుధవారం నాడు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. తెలంగాణలో కొత్తగా ఏర్పాటు అయ్యే విశ్వవిద్యాలయాలు తెలంగాణ విద్యార్ధులకు 25 శాతం సీట్లు కేటాయించాల్సి ఉంటుందనే నిబంధన పెట్టారు. స్థానిక రిజరర్వేషన్ ఉంటుంది కానీ..సామాజిక రిజర్వేషన్లు ఈ విశ్వవిద్యాలయాలకు వర్తించదు. ఓ వైపు మైనారిటీలకు, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచాలని ఆందోళన చేస్తున్న తెలంగాణ సర్కారు ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లులో సామాజిక రిజర్వేషన్ల అంశాన్ని విస్మరించటంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అయినా సరే ప్రభుత్వం ముందుకెళ్ళింది. రాష్ట్రంలోని విద్యార్దులకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందించే లక్ష్యంతోనే ఈ బిల్లును తెచ్చినట్లు సర్కారు చెబుతోంది. దేశంలోని మూడు రాష్ట్రాల్లో తప్ప అన్ని చోట్ల ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి.

అయితే ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లును వ్యతిరేకిస్తూ ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్ యూ, టీవీవీ వంటి విద్యార్ధి సంఘాలు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించాయి. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు విద్యార్దులను అడ్డుకుని అరెస్టులు చేసి..పోలీసు స్టేషన్లకు తరలించారు. ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను అనుమతించటం వల్ల విద్య మరింత వ్యాపారం అవుతుందని విద్యార్ధి సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే విద్యపై ప్రభుత్వం నియంత్రణ లేకుండా పోయిందని.. ఈ విశ్వవిద్యాలయాలపై అయితే ఇక ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ ఉండదని విద్యార్ధి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ బిల్లు పూర్తిగా ప్రైవేట్ సంస్థలకు అనుకూలంగా రూపొందించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Next Story
Share it