Telugu Gateway
Telangana

అడ్వకేట్ జనరల్ నిర్ణయంతో చిక్కుల్లో తెలంగాణ సర్కారు

అడ్వకేట్ జనరల్ నిర్ణయంతో చిక్కుల్లో తెలంగాణ సర్కారు
X

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ దేశాయ్ ప్రకాష్ రెడ్డి రాజీనామా వ్యవహారం సర్కారును ఇరకాటంలో పడేసింది. ఈ నెల 12న అసెంబ్లీలో జరిగిన వివాదానికి సంబంధించి వీడియో ఫుటేజీ అందిస్తామని ఏజీ హైకోర్టుకు హామీ ఇచ్చారు. ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో భిన్నమైన వైఖరి కలిగింది. ఫుటేజీ బయటకు వస్తే కాంగ్రెస్ సభ్యుల సభ్యత్వం రద్దు.... సస్పెన్షన్ కేవలం రాజకీయ ఉద్దేశంతోనే చేశారనే అభిప్రాయం కలిగే అవకాశం ఉందనే ఆందోళన సర్కారులో ఉంది. అసెంబ్లీలో సంఘటన జరిగిన రోజు మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ చివరి వరకూ ప్రశాంతంగా...ఉల్లాసంగానే ఉన్నారని..గవర్నర్ కు వీడ్కోలు పలికే సమయంలో ఆయన చాలా మామూలుగా ఉన్న విషయం వీడియోల్లో స్పష్టమైందని మొదటి నుంచి వార్తలు వెలువడ్డాయి. కానీ అకస్మాత్తుగా మండలి ఛైర్మన్ కంటికి గాయం అంశం తెరపైకి రావటం..ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స పొందటం వంటి అంశాలపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది.

నిజంగా తాము విసిరిన మైక్ మండలి ఛైర్మన్ కు తగిలి ఉంటే తానే స్వయంగా రాజీనామా చేస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసిరారు. ఆ రోజు అసెంబ్లీలో జరిగిన ఘటనలకు సంబంధించిన ఫుటేజ్ మొత్తం బహిర్గతం చేయాలని సవాల్ విసిరారు. అయినా సర్కారు స్పందించలేదు. ఇప్పుడు తాజాగా అడ్వకేట్ జనరల్ రాజీనామాకు సిద్ధపడటంతో ఈ వ్యవహారం మరింత రాజకీయ రంగు పులుముకోవటం ఖాయంగా కన్పిస్తోంది. ఈ నెల 12న అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగం సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలకు సంబంధించిన ఒరిజినల్‌ వీడియో ఫుటేజీలను సమర్పిస్తామంటూ హైకోర్టుకు ఏజీ హోదాలో ప్రకాశ్‌రెడ్డి హామీ ఇవ్వడంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రభుత్వంతో సంప్రదించకుండా అలా ఎలా హామీ ఇస్తారని ప్రశ్నించటంతో ఏజీ మనస్థాపానికి గురైనట్లు సమాచారం.

ఈ కేసులో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వేను రప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు ప్రభుత్వం ప్రకాశ్‌రెడ్డికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ కేసు నుంచి తప్పుకోవాలని ఏజీకి స్పష్టం చేయడంతో ఆయన రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయంపై గత రెండ్రోజులుగా తర్జనభర్జన పడ్డ ఏజీ.. తన సన్నిహితుల వద్ద రాజీనామాపై చర్చించారు. అనంతరం రాజీనామా చేయాలని నిర్ణయించుకుని, సోమవారం ఉదయం 11 గంటల సమయంలో లేఖను సీఎస్‌ ద్వారా గవర్నర్‌కు పంపారు. సర్కారు తీరుపై తీవ్ర అసంతృప్తితోనే ఏజీ రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. ఈ తరుణంలో మంగళవారం హైకోర్టు తీర్పు కీలకంగా మారనుంది.

Next Story
Share it