Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు..లోకేష్ పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబు..లోకేష్ పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ ఆవిర్భావ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితోపాటు ఆయన తనయుడు, మంత్రి నారా లోకేష్ పై సూటిగా తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబూ...మీకు నారా లోకేష్ చేస్తున్న అవినీతి కన్పించటం లేదా?. లోకేష్ అవినీతి చూసి ఎన్టీఆర్ ఆత్మ కూడా క్షోభిస్తుంది. మీరు దోచుకుంటుంటే చూస్తూ ఉండటానికా మేం మద్దతు తెలిపింది. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మనతో కలసి ఉంటాడో లేదో..తెలియదు. జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే డబ్బులు కావాలని బహిరంగంగా మాట్లాడుతుంటుంటే..ఇంత కంటే బరితెగింపు ఉంటుందా?. ఈ డబ్బు మీకు ఎక్కడ నుంచి వస్తుంది. హెరిటేజ్ ఫ్యాక్టరీ నుంచి తీయటం లేదు కదా?. వచ్చే ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గానికి 25 కోట్ల ఇప్పటికే తీసి పెట్టారట. ఎక్కడకు చేర్చాలో అక్కడికి చేర్చేశాడట. సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారు. 2019 ఎన్నికలు 2014 ఎన్నికల అంత సుఖంగా అయితే మీకు ఉండవు. ఖచ్చితంగా ఉండవు.

విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ అవినీతిలో నంబర్ వన్ గా ఉందని ఓ సర్వే తేల్చింది. చంద్రబాబు నాలుగేళ్లలో ఓ ఒక్కరినీ సంతృప్తిపర్చలేదు. రాజధానికి ఇంకా ఎన్ని వేల ఎకరాలు కావాలి మీకు. ఇంకా ఎంత తింటారు. లోకేష్ అవినీతికి అవధుల్లేకుండా పోయింది. ఇక నుంచి తెలుగుదేశం తప్పులను ఎండగడతాం. అవినీతిని ప్రశ్నిస్తూనే ఉంటాం. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదా కోసం ఎందుకు పోరాడలేదు. టీడీపీ ప్రభుత్వం మూడు మాటలు చెపితే ..అందులో ఆరు అబద్దాలు ఉంటున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం ఇలా తయారు కావటం తనకు చాలా బాధగా ఉందన్నారు. ఇసుక ఉచితం అని చెప్పి అడ్డంగా దోచుకున్నారని ఆరోపించారు. టీటీడీ మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డితో లోకేష్ కు సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు.

మీరు దోచుకుంటుంటే చూస్తూ ఉండటానికా మేం మీకు మద్దతు ఇఛ్చింది?. కేంద్ర ప్రభుత్వానికి తాను భయపడాల్సిన పనిలేదన్నారు. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ మాటలు సరికాదన్నారు. ఢిల్లీ తాను 29 సార్లు వెళ్లానని చెప్పుకుంటున్నారని...వాళ్ళు మీతో మాట్లాడటానికి మన బంగారం మంచిది కావాలి కదా? అని వ్యాఖ్యానించారు. కొడుకు కోసమే చంద్రబాబు కేంద్రంతో రాజీపడుతున్నారని ఆరోపించారు. ప్రజల కోసం అవసరం అయితే అమరణ దీక్ష కు దిగుతానని వ్యాఖ్యానించారు. వైసీపీపై కూడా పవన్ విమర్శలు చేశారు. పోరాటం చేసైనా రైల్వే జోన్ సాధిద్దామని ప్రకటించారు. తెలుగుదేశం నేతలు అవినీతి సొమ్ము ఇస్తే తీసుకోవాలని..ఓట్లు మాత్రం జనసేనకు వేయాలని పిలుపునిచ్చారు. అయితే డబ్బులు తీసుకున్నాం కదా..వాళ్ళకే ఓట్లు వేయాలని భావన పెట్టుకోవద్దని..ఈ అంశంపై తాను దేవుడితో మాట్లాడతానని వ్యాఖ్యానించారు. ఆగస్టు 14న జనసేన మేనిఫెస్టోను ప్రకటించనున్నట్లు తెలిపారు.

Next Story
Share it