Telugu Gateway
Cinema

‘ఎన్టీఆర్ ’ బయోపిక్ ప్రారంభం

‘ఎన్టీఆర్ ’ బయోపిక్ ప్రారంభం
X

నటసార్వభౌమ నందమూరి తారకరామారావు జీవిత చరిత్రకు సంబంధించిన సినిమా ‘ఎన్టీఆర్’ షూటింగ్ గురువారం నాడు ప్రారంభం అయింది. ఈ సినిమాకు భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు క్లాప్ కొట్టి ప్రారంభించారు. నాచారంలోని రామకృష్ణ హార్టికల్చర్ స్టూడియోలో అట్టహాసంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రాజకీయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహిస్తుండగా..ఎన్టీఆర్ పాత్రను ఆయన తనయుడు బాలకృష్ణ నటిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి బాలకృష్ణ దుర్యోధనుడి వేషధారణలో వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ కార్యక్రమం ఆసాంతం ఆయన అదే గెటప్ లో ఉన్నారు. ముహుర్తపు షాట్ కూడా ఈ గెటప్ పైనే చిత్రీకరించారు. ఎన్టీఆర్ సినిమా ప్రారంభోత్సవం అనంతరం ఉప రాష్ట్ర ప్రతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఎన్టీఆర్ అంటే తనకు ఎంతో అభిమానం అన్నారు.

ఆయన ఒక్క సినీ చరిత్రలోనే కాకుండా...రాజకీయాల్లోనూ చరిత్ర సృష్టించారన్నారు. భవిష్యత్ తరాలకు ఎన్టీఆర్ అంటే ఎవరో తెలియని వారికి కూడా ఈ సినిమా చూస్తే ఆయన గురించి మొత్తం తెలిసేలా సినిమా ఉండాలని ఆకాంక్షించారు. బాలకృష్ణ సొంతంగా ఓ సంస్థను ఏర్పాటు చేసి ఈ చిత్ర నిర్మాణంలో కూడా పాలుపంచుకుంటున్నారు. దీని కోసం ఆయన తన ఇద్దరు కూతుళ్ళ పేరుతో బ్రహ్మతేజ ప్రొడక్షన్స్ ను ఏర్పాటు చేశారు. అయితే ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రను ఎవరు పోషించనున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఆమె పాత్రకు బాలీవుడ్ నటి విద్యాబాలన్ ను సంప్రదిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి ఇంకా అధికారిక వార్త వెలువడాల్సి ఉంది. ఎన్టీఆర్ సినిమాను ఆయన రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించటంతోనే సినిమాను ముగించనున్నట్లు సమాచారం. సినిమాను దసరాకు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని దర్శకుడు తేజ వెల్లడించారు.

Next Story
Share it