Telugu Gateway
Politics

చంద్రబాబు సమావేశానికి మోత్కుపల్లి డుమ్మా

చంద్రబాబు సమావేశానికి మోత్కుపల్లి డుమ్మా
X

తెలుగుదేశం సీనియర్ నేత, ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు జంపింగ్ కు రంగం సిద్ధం అయిందా?. అంటే అవునంటున్నాయి టీడీపీ వర్గాలు. ఎందుకంటే గత రెండు రోజులుగా టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హైదరాబాద్ లో తెలంగాణ నేతలతో సమావేశం నిర్వహించినా ఈ సమావేశాలకు మోత్కుపల్లి హాజరుకాకపోవటం పార్టీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. కొద్ది రోజుల క్రితం తెలంగాణ టీడీపీని ఏకంగా టీ ఆర్ఎస్ లో విలీనం చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవి పార్టీలో పెద్ద దుమారమే రేపాయి. అంతే కాదు..ఎన్టీఆర్ వర్థంతికి చంద్రబాబు ఎన్టీఆర్ ఘాట్ కు హాజరుకాకపోవటాన్ని కూడా మోత్కుపల్లి తప్పుపట్టారు. అయితే బుధవారం సాయంత్రం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జరిగిన సమావేశంలో విలీనం ప్రతిపాదనను చంద్రబాబు తోసిపుచ్చారు.

ఇలా మాట్లాడే అధికారం ఎవరికీ లేదని..తెలంగాణలో టీడీపీ కొనసాగుతుందని..అయితే ఈ ప్రాంత నేతలే పార్టీని బలోపేతం చేయాలని వ్యాఖ్యానించారు. మోత్కుపల్లిపై చర్యలు తీసుకోవాలంటూ కొంత మంది కార్యకర్తలు డిమాండ్ చేసినా చంద్రబాబు ఈ అంశంపై పెద్దగా స్పందించలేదు. అయితే మోత్కుపల్లి నర్సింహులు పార్టీ మారేందుకు నిర్ణయించుకున్న తర్వాతే ఈ సంచలన వ్యాఖ్యలు చేశారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు సమావేశాలకు కూడా మోత్కుపల్లి హాజరు కాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని ఆ పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులపై కూడా చంద్రబాబు పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.

Next Story
Share it