Telugu Gateway
Top Stories

బిజెపి కంచుకోటలు బద్దలు..ప్రత్యర్దులు కుషీ

బిజెపి కంచుకోటలు బద్దలు..ప్రత్యర్దులు కుషీ
X

ఉప ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చివేస్తాయా?. అధికార బిజెపిలో ఒకింత నిరాశ. మిగిలిన పక్షాల్లో హర్షాతిరేకం. అలా ఇలా కాదు..బిజెపి కంచుకోటలు బద్దలు కావటంతో...ప్రత్యర్థి పార్టీలు మాత్రం ఫుల్ జోష్ లోకి వెళ్ళిపోయాయి. అందునా త్వరలో పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల తరుణంలో వచ్చిన ఈ ఫలితాలు బిజెపిని తీవ్ర నిరాశకు గురిచేశాయి. సొంత సీట్లు..అదీ ఓ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించిన..ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించిన లోక్ సభ సీట్లు దక్కించుకోలేకపోవటం సంచలనంగా మారింది. అయితే బిజెపిని ఓడించేందుకు ఉత్తరప్రదేశ్ లో ప్రత్యర్థులుగా ఉన్న ఎస్పీ, బీఎస్పీలు ఒక్కటి కావటం ఈ ఫలితాలకు కారణం అయింది. ఎలాగైనా బిజెపిని ఓడించాలనే కసితో ఉన్న ఈ రెండు పార్టీలు వచ్చే ఎన్నికల్లో ఇదే పద్దతిని ఫాలో అయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. యూపీలోని రెండు సిట్టింగ్ స్థానాల్లోనూ బీజేపీ ఓటమి చవిచూసింది. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ నియోజకవర్గం గోరఖ్‌పూర్‌లో బీజేపీ ఓటమి పాలైంది. భాజపా అభ్యర్థి ఉపేంద్ర దత్ శుక్లాపై సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి ప్రవీణ్‌ నిషాద్‌ పై 20వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ఎస్పీ అభ్యర్థులకు బీఎస్పీ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. డిప్యూటీ సీఎం కేశవ్‌‌ ప్రసాద్‌ మౌర్య రాజీనామాతో ఖాళీ అయిన ఫుల్‌పూర్ నియోజకవర్గంలోనూ బీజేపీకి ప్రతికూల ఫలితం వచ్చింది.

ఫూల్‌పుర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో భాజపా అభ్యర్థిపై ఎస్పీ అభ్యర్థి నాగేంద్ర ప్రతాప్‌ సింగ్‌ పటేల్‌ 59, 613 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దీంతో సీఎం యోగి, డిప్యూటీ సీఎం కేశవ్ మౌర్య రాజీనామాలతో ఖాళీ అయిన లోక్‌సభ రెండు స్థానాల్లో బీజేపీ ఓడినట్లయింది. ఈ రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు. మరోవైపు గోరఖ్‌పూర్‌ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 1991 నుంచి ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా ఓటమి చెందలేదు. 2014లో ఇక్కడి నుంచి గెలిచిన ఆదిత్యనాధ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగా, పూల్‌పూర్‌ నుంచి గెలిచిన కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య డిప్యూటీ సీఎంగా ఎన్నిక కావడంతో ఈ నెల 4వ తేదీన ఈ రెండు నియోజకవర్గాలకు ఉప ఎన్నిక జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇక్కడి నుంచి 1998, 1999, 2004, 2009, 2014 వరుస ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీచేసి విజయం సాధించారు. తాజా ఫలితం ఆయనతోపాటు బిజెపిని షాక్ కు గురిచేసింది.

Next Story
Share it