Telugu Gateway
Andhra Pradesh

సీఎస్ సిఫారసులను బేఖాతర్ చేసిన లోకేష్..చంద్రబాబు

సీఎస్ సిఫారసులను బేఖాతర్ చేసిన లోకేష్..చంద్రబాబు
X

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ లు ఇష్టారాజ్యం ఎలా సాగుతుందో తెలియజేసే సంఘటన ఇది. విశాఖపట్నంలోని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఇన్నోవా సొల్యూషన్స్ కు జరిగిన భూ కేటాయింపు గోల్ మాల్ లో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. రుషికొండలోని 400 కోట్ల రూపాయల పైబడిన విలువతో కూడిన 40 ఎకరాల భూమిని 13 కోట్ల రూపాయలకే కట్టబెట్టిన సంగతి తెలిసిందే. విశాఖపట్నంలో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థకు సర్కారు 25 ఎకరాలు కేటాయించింది. కానీ అమెరికాలో కాలిఫోర్నియాలో ఉన్న ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ హెడ్ ఆఫీస్ మొత్తం కేవలం 10 ఎకరాల్లోనే విస్తరించింది. కానీ ఏపీ సర్కారు మాత్రం విశాఖపట్నంలో అత్యంత ఖరీదైన భూమిని కారుచౌకగా కట్టబెట్టడానికి జీవో ఇఛ్చేసిన సంగతి తెలిసిందే. సాక్ష్యాత్తూ రాష్ట్ర పరిపాలనకు ప్రధాన అధికారి అయిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ గత ఏడాది డిసెంబర్ 20న జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (ఎస్ ఐపిసి)లో ఇదే అంశాలను ప్రస్తావించారు.

ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ హెడ్ ఆఫీస్ పది ఎకరాల్లోనే ఉన్నందున తొలి దశలో పది ఎకరాలు ఇచ్చి..మిగతా మొత్తాన్ని రిజర్వ్ చేసి పెట్టి..దశల వారీగా భూ కేటాయింపు చేయాలని ఆయన ప్రభుత్వానికి సిఫారసు చేశారు. అదే సమయంలో రుషికొండలోని విలువైన భూములను ఏపీఐఐసీ 2.70 కోట్ల రూపాయలకు ఇస్తున్నందున ..అదే రేటుకు ఈ సంస్థలకు ఇవ్వాలని ఎస్ ఐపీసీ పేర్కొంది. ఐటి పాలసీనే ఫాలో కావాలని సీఎస్ స్పష్టం చేశారు. అయితే ఈ సిఫారసులను ఐటి శాఖ మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా తాము అనుకున్నట్లుగానే ఎకరా 32.50 లక్షల లెక్కన 400 కోట్ల రూపాయల విలువైన 40 ఎకరాలను 13 కోట్ల రూపాయలకు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఇన్నోవా సొల్యూషన్స్ కు కట్టబెట్టారు. ఈ వ్యవహారం వెనక భారీ గోల్ మాల్ జరిగినట్లు స్పష్టంగా కన్పిస్తోందని ప్రభుత్వ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. సాక్ష్యాత్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఫారసులను కూడా ప్రభుత్వం లెక్క చేయటంలేదంటే ఎవరి ప్రయోజనాల కోసం వీళ్లు పనిచేస్తున్నారో స్పష్టం అవుతోందని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు.

Next Story
Share it