Telugu Gateway
Politics

నోరు జారారన్న కెటీఆర్..కవిత...నేనేమీ అనలేదన్న కెసీఆర్

నోరు జారారన్న కెటీఆర్..కవిత...నేనేమీ అనలేదన్న కెసీఆర్
X

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ తాజాగా ప్రధాని నరేంద్రమోడీపై చేసిన వ్యాఖ్యల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. కెసీఆర్ చేసిన ‘మోడీగాడు’ వ్యాఖ్యలు నోరుజారి..పొరపాటున వచ్చినవే తప్ప..ఉద్దేశపూర్వకంగా చేసినవి కావని మంత్రి కెటీఆర్, కవితలు ప్రకటించారు. కెటీఆర్ వివరణ అంశాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాకు తెలిపారు. ఓ ముఖ్యమంత్రి ప్రధానిపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా?. అని నిర్మలా సీతారామన్ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ సీఎం కెసీఆర్ శనివారం నాడు విలేకరుల సమావేశం పెట్టి మరీ అసలు తాను మోడీపై ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదన్నారు. మరి అలాంటప్పుడు కెటీఆర్, కవితలు ఎందుకు వివరణ ఇవ్వాల్సి వచ్చింది అన్నది ఓ పెద్ద సస్పెన్స్ గా మారింది. అవసరం అయితే మోడీని విమర్శిస్తామని..ఎందుకు భయపడాలి అని కెసీఆర్ ప్రశ్నించారు.

తెలంగాణ బిజెపి నేతలు అడ్డగోలుగా మాట్లాడితే సహించబోనని హెచ్చరించారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరిక జారీ చేశారు. ప్రగతిభవన్ లో మీడియా సమావేశంలో కేసిఆర్ అనేక అంశాలపై మాట్లాడారు. ప్రధానినే విమర్శిస్తరా అని కొందరు మాట్లాడుతున్నారు. అవసరమైతే విమర్శిస్తారు. ప్రజాస్వామ్యంలో సహజం. కేసిఆర్ కు జైలుకు పోవాలని ఉందా? అని బిజెపి ఎమ్మెల్యే అంటున్నాడు. కేసిఆర్ ను జైలుకు పంపుతారా? కొన్ని సందర్భాల్లో కొంతమందిని ముట్టుకుంటే భస్మమైపోతారు. ఏం జైలుకు పోతారండి. తోక.. నాకున్నదేంది? నేను జైలుకు పోయేదేంది? దుర్మార్గమైన సంపాదన మాకు అక్కర లేదని అనుకున్నం. నా జేబుకు ఉండే పెన్నుతో సహా నేను ఐటి లెక్కలు సమర్పిస్తాం. ఎన్నికల్లో నిలబడ్డప్పుడు లెక్కలిస్తం. ఇంతకుముందు దొంగ పనులు చేసినోళ్లు, కుంభకోణాలు చేసినోళ్లు, తప్పు పనులు చేసినోళ్లు భయపడతారు. నన్ను ముట్టుకుని చూస్తే తెలుస్తది. ఎవలి కథ ఏందో అన్నది. అన్ని పార్టీలకు చందాలిస్తారు. ఎన్నికలు వచ్చినప్పుడు అన్ని పార్టీలు ఎట్లా నడుస్తాయో మా పర్టీ అట్లనే నడుస్తది. నిర్మలా సీతారామన్ వచ్చి దృష్టి సారించిందని ఒక జోక్ ప్రచారం చేస్తున్నారు. రోజు దృష్టి సారిస్తారయా నాకర్థం కాదు. సారించుకోండి ఎవలొద్దన్నరు? రోజు కాకపోతే గంట గంటకు సారించుకోండ్రి. మేము సర్వే చేయించుకున్నామంటున్నాడు. మా సర్వే ఉత్తమ్ కుమార్ రెడ్డి కోసం చేయిస్తమా? నేను రెండు సర్వేలు కలిపి ఆరున్నర లక్షల షాంపిల్స్ ఒకదాంట్లో 106, ఇంకోదాంట్లో 103 అని వచ్చాయి. సన్యాసం తీసుకుంటా అని అంటున్నాడు. నువ్వు గడ్డం పెంచుకుంటే.. సన్యాసం తీసుకుంటే రాజకీయం ఉంటాదయా నాకు అర్థం కాదు. పలానాయన గడ్డం పెంచుకుండంటే ఓట్లేస్తరా? నేను వాడు, వీడు అన్న పదజాలం మాట్లాడిన కానీ మోడీ గారిని కాదు.. కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్, బిజెపి అధికారంలోకి వచ్చినా ఒరిగేదేం లేదని చెప్పిన. వాడు, వీడు అని ఎపి రాజకీయాల గురించి మాట్లాడిన. ఉమ్మడి రాష్ట్రంలో టిడిపి అధికారంలో ఉంటే కాంగ్రెస్ వాడు, కాంగ్రెస్ అధికారంలో ఉంటే టిడిపి వాడు కందెన్లు, వరి కంకులు తీసుకొచ్చిండు అన్న తప్ప ఇంకోటి కాదు. తెలంగాణలో వాడే కామన్ భాషనే మాట్లాడుతున్న. వీడు రాడు, వాడు రాడు అన్నది కామన్ లంగ్వేజ్. సింపుల్ లాంగ్వేజ్ లో కచ్చితంగా గట్లనే మాట్లాడతా. సంస్కృతాలు మాట్లాడుడు నాతోటి కాదు. బిజెపి పార్టీ ఉన్నాదండీ తెలంగాణలో. లక్ష్మణ్ మాట్లాడతాడు పెద్ద జోక్. వరంగల్ బై ఎలక్షన్స్ లో పాపం అమెరికా నుంచి డాక్టర్ ను తెచ్చుకున్నారు. ఏమైంది. వాళ్ల సక్కదనం. కాంగ్రెస్ వాళ్లకు ఉన్న ప్రస్టేషన్ ప్రజలకున్నట్లు భావించి మాట్లాడుతున్నారు. పేద్ద బస్సు యాత్ర అని కొండంత రాగం తీస్తే ఏడ ఐదారు వేలు దాటలేదు. రైతులకు ఇన్వెస్ట్ మెంట్ సపోర్ట్ ఇయ్యమని ఎవరన్నా అడిగిర్రా? తెలంగాణలో సంక్షేమం, అభివృద్ధి జరుగుతున్నది.

ఇవన్నీ ప్రజలకు తెలిసిపోయినయ్. మా స్కీములన్నీ గోప్యంగా ఉండవు. ఓపెన్ గానే ఉంటాయి. భగీరథ నీళ్లు, కళ్యాణ లక్ష్మి వచ్చే, 24 గంటల కరెంటు వచ్చె. ఇవన్నీ దాచిపెడితే దాగుతయా? కాంగ్రెస్ పార్టీ ఎన్ని సర్కస్ ఫీట్లు చేసినా 10 సీట్లు దాటవు. అది కూడా మేము పట్టించుకోకపోతే.. పట్టించుకుంటే కథ వేరే ఉంటది. బిజెపికి ఒక్కటి కూడా రావు. నేను 70 నిమిషాలు మాట్లాడిన. మిగిలిన 68 నిమిషాల ముచ్చటేంది? దానికి సమాధానం చెప్పరేంది? అయినా అనని మాటను పట్టుకుని గాయి గాయి చేస్తున్నరు. నేను ఎవరిని దూషించలేదు. దూషించాలని నా ఉద్దేశం కాదు. కాంగ్రెస్, బిజెపి దొందు దొందే. దేశంలో గుణాత్మకమైన మార్పు వస్తలేదు. సీరియస్ గా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. దేశ రాజకీయాల్లో ప్రభలమైన మార్పులు రావాలి. ఆ స్టాండ్ మీద స్టిక్ అయి ఉన్నం. మేము అదే బాటలో సాగుతాం. పిచ్చి ప్రయత్నాలు మానుకుంటే మంచిది.’ అని హెచ్చరించారు. కాంగ్రెస్, బిజెపిలతో సంబంధం లేకుండా కలసి వచ్చే పార్టీలతో ఒక మార్పు కోసం ప్రయత్నిస్తామని కెసీఆర్ ప్రకటించారు.

Next Story
Share it