Telugu Gateway
Top Stories

బిజెపి దూకుడు...జోష్ లో అమిత్ షా

బిజెపి దూకుడు...జోష్ లో అమిత్ షా
X

బిజెపి యమా దూకుడు మీద ఉంది. ప్రధాని మోడీ హవా తగ్గుతుందని అందరూ భావిస్తున్న వేళ వచ్చిన ఫలితాలు ఆ పార్టీలో కొత్త ఉత్సాహన్ని నింపాయి. విజయ్ మాల్యా..నీరవ్ మోడీ ఉదంతాలు బిజెపి ప్రతిష్టను మసకబార్చాయి. పెద్ద నోట్ల రద్దు..జీఎస్టీ, బ్యాంకింగ్ రంగంలో కుంభకోణాలు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ తరుణంలో కమ్యూనిస్టుల కంచుకోటను బిజెపి బద్దలు కొట్టింది. 25 సంవత్సరా అప్రతిహత పాలనకు చరమగీతం పాడి...అధికార పగ్గాలు చేపట్టేందుకు రెడీ అయింది. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మాటల్లోనే ఆ జోష్ కన్పించింది. లెఫ్ట్‌ పార్టీ ఈ దేశానికి రైట్ ‌(సరైనది) కాదని ఆయన పంచ్ లు వేశారు. బీజేపీకి ఇది చాలా సంతోషకరమైన రోజు అని, 21 రాష్ట్రాల్లో తాము అధికారంలోకి వచ్చామని చెప్పారు. ఒడిశా, పశ్చిమబెంగాల్‌, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కూడా అధికారంలోకి వస్తే ఇక బీజేపీకి స్వర్ణయుగమే అని పేర్కొన్నారు. త్రిపుర, నాగాలాండ్‌ రాష్ట్రాల్లో బీజేపీ అధికారం దాదాపు ఖరారైన నేపథ్యంలో నేపథ్యంలో అమిత్‌షా మీడియాతో మాట్లాడారు.

'ఇది బీజేపీకి చారిత్రాత్మక రోజు. ప్రధాని మోదీ విధానాలకు అందిన విజయం ఇది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో బీజేపీ జెండా ఎగురుతుంది. మూడు రాష్ట్రాల కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు. 2013లో త్రిపురలో మాకు 1.3శాతం ఓట్లు మాత్రమే లభించాయి. ఇప్పుడు 43 స్థానాలు గెలుస్తున్నాం. త్రిపురలో పలువురు కార్యకర్తలు ప్రాణత్యాగాలు చేశారు. త్రిపుర వాసులు వామపక్షాల నుంచి విముక్తి కోరుకుంటున్నారు. త్రిపుర, నాగాలాండ్‌లో కాంగ్రెస్‌ ఖాతా కూడా తెరవలేక పోయింది. మాపై నమ్మకంతో ఓట్లు వేసిన త్రిపుర ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. గత ఎన్నికలతో పోల్చితే బీజేపీకి ఓటింగ్‌ శాతం పెరిగింది. ఇక కర్ణాటకలో భారీ మెజార్టీ లక్ష్యంగా బరిలోకి దిగుతాం. ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి మాలక్ష్యం. దేశంలో 21 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది.’ అని తెలిపారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో బిజెపి ఈ ఫలితాల జోష్ తో దూకుడు మరింత పెంచే అవకాశం కన్పిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఈ ఫలితాలు పూర్తి నిరాశను మిగిల్చాయి.

Next Story
Share it