Telugu Gateway
Telangana

‘హరీష్ రావు’ సంచలన వ్యాఖ్యలు

‘హరీష్ రావు’ సంచలన వ్యాఖ్యలు
X

తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు శుక్రవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘తన పుట్టుక...చావు టీఆర్ఎస్ లోనే’ అని ప్రకటించారు. గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో హరీష్ రావు 40 మంది ఎమ్మెల్యేలను తీసుకుని బిజెపిలో చేరతారని ప్రచారం జరుగుతోంది. మార్ఫింగ్ ఫోటోలతో ఈ ప్రచారం చేస్తున్నారు. వీటిపై హరీష్ రావు చాలా తీవ్రంగా స్పందించారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా డీజీపికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అదే సమయంలో హరీష్ రావుతో పాటు మరికొంత మందికి ఎంపీ సీట్లు కేటాయిస్తారని మీడియాలో భారీ ఎత్తున కథనాలు వస్తున్నాయి. ఇదంతా కూడా మంత్రి కెటీఆర్ ను సీఎం చేసేందుకు మార్గం సుగమం చేయటం కోసమే అని చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఈ తరుణంలో హరీష్ రావు అన్ని పుకార్లకు చెక్ పెడుతూ స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. 'కేసీఆర్‌ మాటే.. నా మాట. నా పుట్టుక టీఆర్‌ఎస్‌లో.. చావు కూడా టీఆర్‌ఎస్‌లోనే' అని హరీష్‌ రావు తేల్చిచెప్పారు. ఇకపై అలాంటి పుకార్లు ఎవరు ప్రచారం చేసినా చర్యలకు బాధ్యులు కావాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌దే గెలుపని అన్నారు.

'కాంగ్రెస్‌ పార్టీకి రానున్న ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా రాదు. అధికారంలోకి రాదు కాబట్టే ఇష్టం వచ్చినట్టు కాంగ్రెస్‌ నేతలు హామీలు ఇస్తున్నారు. 2019 కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఒక్కటైనా అమలు చేశారా. అమలు చేయని కాంగ్రెస్‌ను ప్రజలు ఎలా నమ్ముతారు. 9 గంటల కరెంటు ఇస్తామని చెప్పారు.. కానీ ఉత్తి కరెంటు ఇచ్చారు. ఉద్యమ కాలంలో రాజీనామాలు చేద్దాం రండి అంటే పారిపోయారు. కాంగ్రెస్‌ పాలనలో ప్రాజెక్టుల పేర్లే.. పెండింగ్‌ ప్రాజెక్టులుగా మారాయి. మా హయాంలో అవి రన్నింగ్ ప్రాజెక్టులుగా మారాయి. మీరు కరెంట్ ఇవ్వలేదు. మేం ఇచ్చినం, మీరు నీళ్లు ఇవ్వలేదు..మేం నీళ్లు ఇచ్చినం. మీ హయాంలో ఆడపిల్ల భారం.. మా పాలనలో లక్ష్మీ. బస్సు యాత్ర కేవలం ఉనికి కోసమే. మీరు ఒత్తిడిలో ఉన్నారని.. మీ మాటలే చెబుతున్నాయి. మంత్రి ఈటెల రాజేందర్‌ మీద విమర్శలు నిరాధారం.' అని హరీష్‌ రావు తెలిపారు.

Next Story
Share it