Telugu Gateway
Telangana

కెసీఆర్ హెచ్చరికలను పట్టించుకోని కాంగ్రెస్

కెసీఆర్ హెచ్చరికలను పట్టించుకోని కాంగ్రెస్
X

తెలంగాణ శాసనసభ సమావేశాలు మొదటి రోజే హాట్ హాట్ గా మొదలయ్యాయి. సభలో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటే సమావేశాలు ముగిసేవరకూ సభ్యులను సస్పెండ్ చేస్తామని ముఖ్యమంత్రి కెసీఆర్ హెచ్చరించారు. అయినా కూడా ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు ఏ హెచ్చరికలను ఏ మాత్రం లెక్కచేయలేదు. తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలంటూ కాంగ్రెస్ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ..ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతే కాదు గవర్నర్ ప్రసంగ పాఠాన్ని కూడా చించేసి పోడియం వైపు విసిరేశారు. కాంగ్రెస్ సభ్యులు పోడియం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా..వారిని మార్షల్స్ సభ్యుల సీట్ల వద్దే అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మార్షల్స్ తో ఉత్తమ్ కుమార్ రెడ్డి, జీవన్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ ఆందోళలను ముందే ఊహించిన అధికార పార్టీ భారీ ఎత్తున సభలో మార్షల్స్ ను మోహరించింది.

కాంగ్రెస్ సభ్యుల నినాదాలు..ఆందోళనల నడుమే గవర్నర్ నరసింహన్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. సోమవారం ఉదయం 10 గంటలకు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశి గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగాన్ని చదవడం మొదలుపెట్టిన కాసేపటికే.. కాంగ్రెస్‌ సభ్యులు తమ స్థానాల్లో నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గవర్నర్‌ నిల్చున్న వెల్‌లోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేశారు. అంతలోనే వారిని మార్షల్స్‌ అడ్డుకున్నారు. ఈ క్రమంలో కొందరు సభ్యులు బడ్జెట్‌ ప్రతులను చింపేసి గవర్నర్‌పైకి విసిరే ప్రయత్నం చేశారు. ప్రసంగం పూర్తైన అనంతరం సభ రేపటికి వాయిదాపడింది. మార్చి 15న మంత్రి ఈటల బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. గవర్నర్ తన ప్రసంగంలో తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకెళుతోందని తెలిపారు.

దేశంలో కొత్తగా ఏర్పాటైన రాష్ట్రమే అయినప్పటికీ అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ ప్రధమ స్థానంలో నిలిచిందని గవర్నర్‌ తెలిపారు. గడిచిన మూడేళ్లలో ఎన్నెన్నో సవాళ్లను అధిగమించామని, కాళేశ్వరం సహా ఇతర భారీ ప్రాజెక్టులను త్వరలోనే పూర్తిచేస్తామని, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌, గొర్రెల పంపిణీ, కల్యాణ లక్ష్మీ, రైతులకు రుణమాఫీ తదితర పథకాలను విజయవంతంగా అమలుచేస్తున్నామని తెలిపారు. మాజీ మంత్రి గీతారెడ్డితోపాటు పలువురు సభ్యులు గవర్నర్ ప్రసంగ ప్రతులను చింపి విసిరేశారు. అయితే గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంటకరెడ్డి హెడ్ ఫోన్స్ ను పోడియం వైపు విసిరేశారు. అవి కాస్తా మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ కు తగిలినట్లు చెబుతున్నారు. దీనిపై సీరియస్ గా ఉన్న సర్కారు కోమటిరెడ్డిపై చర్యలకు సిద్ధం అవుతోంది.

Next Story
Share it