Telugu Gateway
Politics

తెలంగాణలో ఫిరాయింపులకు కెసీఆర్ కొత్త భాష్యం

తెలంగాణలో  ఫిరాయింపులకు కెసీఆర్ కొత్త భాష్యం
X

అసెంబ్లీ సాక్షిగా ఫిరాయింపులకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కొత్త భాష్యం చెప్పారు. తెలంగాణలో జరిగినవి ఫిరాయింపులు కావని...విలీనాలు అని ప్రకటించారు. రాజకీయ సుస్థిరత కోసం తాము వారిని ఆహ్వానించామని...తర్వాత టీడీపీ నుంచి చీలిపోయి ఎక్కువ మంది వచ్చి తమలో విలీనం అయ్యారని తెలిపారు. వైసీపీ, సీపీఐ, బిఎస్పీలదీ కూడా విలీనమే అన్నారు. తెలంగాణా రాష్ట్ర సాధన ఎంత ముఖ్యమో..రాజకీయ సుస్థిరత కూడా అంతే ముఖ్యమని తెలిపారు. అందుకే తాము వీరిని ఆహ్వానించామని తెలిపారు. తమకు 63 సీట్లు రావటంతో కాంగ్రెస్ వాళ్లు..మిగిలిన పార్టీల వారు ఏమి చేశారో తనకు తెలుసని..తన దగ్గర నివేదికలు ఉన్నాయని అన్నారు. తెలంగాణలో సుస్థిరత సాధించేందుకు ఇతర పార్టీల వారిని ఆహ్వానించామని తెలిపారు. తర్వాత స్పీకర్ కూడా విలీనాలపై బులెటిన్ విడుదల చేశారని వెల్లడించారు. అయితే తెలుగుదేశం పార్టీ సభ్యులను విడివిడిగా చేర్చుకుని..తర్వాత ఎప్పుడో చివర్లో ఈ విలీనం అంశాన్ని తెరపైకి తెచ్చిన విషయం తెలిసిందే. తొలుతే సనత్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాసయాదవ్ ను తీసుకుని మంత్రివర్గంలో చోటు కల్పించిన విషయం రాజకీయంగా పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వరస పెట్టి తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించారు. ఒక్క తెలుగుదేశం ఏమిటి కాంగ్రెస్ తోపాటు అన్ని పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. ఈ ఫిరాయింపు అంశంపై ఫిర్యాదులు స్పీకర్ వద్ద ఉండగానే...సీఎం కెసీఆర్ ఏకంగా ఇవి విలీనాలు అని ప్రకటించటం విశేషం.

గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతూ కెసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ కాంగ్రెస్ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ వెనకబాటుకు ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీనే అని విమర్శించారు. చేతనైతే మూకుమ్మడి రాజీనామాలు చేయవచ్చు కదా?. దీనికి కూడా ఢిల్లీ పర్మిషన్ కావాలా?. తుమ్మటానికి..దగ్గటానికి ఢిల్లీ పర్మిషన్ కావాలి అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణలో తమ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేస్తున్నా విపక్షాలకు మాత్రం అదేమీ కన్పించటంలేదని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంతో పోలిస్తే తెలంగాణలో మూలధన వ్యయం గణనీయంగా పెరిగిందని కెసీఆర్ వెల్లడించారు. సభలో ఎవరైనా పరిమితి మేరకు ఆందోళనలు చేయవచ్చని అన్నారు. ఆన్ లైన్ టెండర్లలో అవినీతికి ఆస్కారమేలేదని..ఎవరైనా ఇందులో పాల్గొనవచ్చని పేర్కొన్నారు.

Next Story
Share it