Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు...సగం బయట..సగం లోపల

చంద్రబాబు...సగం బయట..సగం లోపల
X

ఓ వైపు బిజెపి ఏపీకి అన్యాయం చేసింది అంటారు. కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసింది అని చెబుతారు. అసలు ఏపీ అడిగేది వందకు వంద శాతం న్యాయమైనవి అని వాదిస్తారు. మరి న్యాయమైన కోర్కెలను కూడా ఏ మాత్రం పట్టించుకోని బిజెపి నేతృత్వంలోని ఎన్డీయేలో ఇంకా కొనసాగాలని నిర్ణయించుకోవటం వెనక మతలబు ఏమిటి?. అంటే కేవలం రాజకీయంగా ప్రయోజనం పొందేందుకే టీడీపీ మంత్రులను రాజీనామా చేయాలని ఆదేశించారా?. మంత్రులు రాజీనామా చేసి...టీడీపీ ఎన్డీయేలో భాగస్వామిగా కొనసాగటం వెనక ఏమైనా అర్థం ఉంటుందా?. ఇదే పరిస్థితి కొనసాగితే రాజీనామాల వల్ల వస్తదనుకున్న రాజకీయం ప్రయోజనం కాస్తా పోవటం సంగతి అలా ఉంచి..మరింత నష్టపోవాల్సి వస్తుందనే ఆందోళన టీడీపీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. నిజానికి ప్రస్తుతం బిజెపికి టీడీపీ మద్దతు ఏ మాత్రం అవసరం లేదు. ఎన్డీయే నుంచి బయటకు వచ్చినా ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ లేదు. పోనీ కేంద్ర ప్రభుత్వం టీడీపీ నిర్ణయంతో పడిపోయే పరిస్థితి ఉంటే..కాస్త ఆచితూచి వ్యవహరించినా ఒకింత అర్థం ఉంటుంది. కానీ అలాంటిది ఏమీ లేకుండా బిజెపి సారధ్యంలోని ఎన్డీయేలో కొనసాగటం అనేది చంద్రబాబు డబుల్ గేమ్ తప్ప..మరొకటి కాదనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

ఓ వైపు కాంగ్రెస్ ను మించి బిజెపి, మోడీ మోసం చేశారని ఆరోపిస్తూ ఇంకా అదే పార్టీని పట్టుకుని వేలాడటం ద్వారా చంద్రబాబు టీడీపీ శ్రేణలకు ఎలాంటి సంకేతం ఇవ్వదలచుకున్నారు? ఎన్నికల ముందు భాగస్వామిగా ఉన్న టీడీపీ ప్రత్యేక హదాతో పాటు పలు అంశాలపై అభ్యంతరాలు లేవనెత్తుతుంటే కనీసం ప్రధాని మోడీ కనీసం టీడీపీ అధినేతను పిలిచి చర్చించలేదంటే ఆ పార్టీ వైఖరి ఎలా ఉందో అర్థం అవుతూనే ఉంది. అయినా సరే ఇంకా చంద్రబాబు ఎన్డీయేని పట్టుకుని వేలాడితే రాజకీయంగా లాభం కంటే..నష్టమే ఎక్కువ జరుగుతుందని టీడీపీ వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి. నాలుగేళ్లు సఖ్యతతో సాధిస్తాం...కేంద్రం సాయం లేకుండా ముందుకు సాగలేం అని బహిరంగంగా వ్యాఖ్యానించి...ఇప్పుడు మళ్ళీ మంత్రి పదవులకు రాజీనామా చేస్తామని ప్రకటించి.. ఎన్డీయేలో కొనసాగటంతో టీడీపీ నష్టపోవాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. చంద్రబాబునాయుడు కేసులకు భయపడే ఎన్డీయే నుంచి బయటకు రావటంలేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. టీడీపీ ఎన్డీయేలో కొనసాగటం అంటే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఇద్దరూ కలసి పోటీ చేస్తారా?. ఆ అవకాశం లేనప్పుడు కొనసాగటం వెనక మతలబు ‘కేసులే’ అని బలంగా విన్పిస్తోంది.

Next Story
Share it