Telugu Gateway
Top Stories

‘ఎన్టీఆర్ ’ బయోపిక్ ప్రారంభోత్సవానికి బాబు..లోకేష్ డుమ్మా

‘ఎన్టీఆర్ ’ బయోపిక్ ప్రారంభోత్సవానికి బాబు..లోకేష్ డుమ్మా
X

తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఆయన జీవిత చరిత్ర సినిమాకు సంబంధించిన ప్రారంభోత్సవానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ లు డుమ్మా కొట్టడటం చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను బాలకృష్ణ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రారంభోత్సవానికి భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. సినిమా ప్రారంభోత్సవం కూడా టీడీపీ వ్యవస్థాపక దినోత్సవం రోజు మొదలు కావటం విశేషం. గురువారం ఉదయమే ఈ సినిమా ముహుర్తపు షాట్ కార్యక్రమం జరిగింది. ఈ సినిమా ప్రారంభోత్సవానికి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తో పాటు బిజెపి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ కూడా హాజరయ్యారు. సినీ రంగానికి చెందిన ముఖ్యులు అందరూ వచ్చారు. అయితే ఈ కార్యక్రమానికి చంద్రబాబు, లోకేష్ లు హాజరు కాకపోటం సరికాదనే అభిప్రాయం కార్యక్రమానికి హాజరైన వారిలో వ్యక్తం అయింది.

రాజకీయ అవసరాల కోసం నిత్యం ఎన్టీఆర్ పేరు వాడుకుంటూ ఆయన జీవిత చరిత్ర సినిమాకు వీరిద్దరూ దూరంగా ఉండటానికి కారణాలు ఏమై ఉంటాయా? అనే అంశంపై చర్చ జరుగుతోంది. కొద్ది రోజుల క్రితం ఎంతో చరిత్ర గల ఎన్టీఆర్ జీవిత చరిత్రను రెండున్నర గంటల్లో చెప్పటం కష్టం అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఇది జరిగిన కొద్ది రోజులకే బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ ను ప్రకటించారు. అయితే ఎన్టీఆర్ జీవిత్ర చరిత్రలో కొన్ని కీలక ఘట్టాలు కూడా ఉన్నాయి. అందులో అత్యంత ముఖ్యమైనది ఆయన్ను చంద్రబాబు పదవీచ్యుతుడు చేయటం. అయితే ఈ సినిమాలో ఆ ఘట్టం ఉండకపోవచ్చని చెబుతున్నారు. అయినా చంద్రబాబు..లోకేష్ లు ఈ సినిమా ప్రారంభోత్సవానికి డుమ్మా కొట్టడం కీలకంగా మారింది.

Next Story
Share it