Telugu Gateway
Andhra Pradesh

బాబోయ్...చంద్రబాబు లెక్కల మాయాజాలం

బాబోయ్...చంద్రబాబు లెక్కల మాయాజాలం
X

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘దొంగ లెక్కలు’ ఎంత అలవోకగా చెబుతారు అనటానికి ఇది ఓ అద్భుతమైన ఉదాహరణ. రెండు రోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆయన లెక్కల రహస్యం బహిర్గతం అవుతుంది. అదేంటో మీరూ చూడండి. ‘ లోకేష్ పై పవన్ కళ్యాణ్ చేసిన అవినీతి ఆరోపణలు ఖండిస్తున్నా. లోకేష్ కి హెరిటేజ్ లో ఏటా వంద కోట్ల రూపాయల లాభాలొస్తున్నాయి?.35 కోట్ల రూపాయలు పన్నులు కట్టినా 65 కోట్ల రూపాయలతో హాయిగా వ్యాపారం చేసుకోవచ్చు కదా?.ఎందుకింత కష్టపడాలి?.’ ఇవీ చంద్రబాబు వ్యాఖ్యలు. కానీ అసలు విషయం ఏమిటో మీరే చూడండి. 2013-14 ఆర్థిక సంవత్సరరంలో హెరిటేజ్ ఫుడ్స్ నికర లాభం 45.31 కోట్ల రూపాయలు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో హెరిటేజ్ ఫుడ్స్ నికర లాభం 28.21 కోట్ల రూపాయలు. 2015-16 లో హెరిటేజ్ నికర లాభం 55.43 కోట్ల రూపాయలు, 2016-17లో నికర లాభం 66.82 కోట్ల రూపాయలు. గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా చంద్రబాబు చెప్పినట్లు వంద కోట్ల రూపాయల లాభం రాలేదు. చంద్రబాబు చెప్పిన లెక్కలకు..హెరిటేజ్ ఫుడ్స్ లెక్కలకు ఏ మాత్రం పొంతన లేదు. మరి చంద్రబాబు మీడియా సాక్షిగా లోకేష్ కు వంద కోట్ల రూపాయల లాభం వస్తుందని ఎలా చెబుతారు?. నిజంగా హెరిటేజ్ కు వంద కోట్ల రూపాయల లాభం వచ్చినా అది లోకేష్ ఖాతాలో వచ్చిపడదు.

డివిడెండ్ రూపంలో వచ్చేది మాత్రమే లోకేష్ ఖాతాలోకి వస్తుంది. ప్రస్తుతం హెరిటేజ్ లో ప్రమోటర్ల వాటా కేవలం 39.90 శాతం మాత్రమే. మిగిలిన 60.10 శాతం వాటా పబ్లిక్ చేతుల్లోనే ఉంది. డివిడెండ్ కూడా ఈ వాటాల ప్రకారమే వారి వారి ఖాతాల్లోకి వెళుతుంది. మరి చంద్రబాబు మాటలు చూస్తే ఎవరికైనా హెరిటేజ్ ఫుడ్స్ లెక్కల్లో గోల్ మాల్ జరుగుతుందా?. ఏపీ ప్రజలను రోజుకో మాటతో మోసం చేస్తున్నట్లు..హెరిటేజ్ ఇన్వెస్టర్లను కూడా మోసం చేస్తున్నారా? అనే అనుమానాలు రాకమానదు. లేదంటే వేరే మార్గంలో కూడా వచ్చే ఆదాయాన్ని కూడా చంద్రబాబు హెరిటేజ్ ఫుడ్స్ లెక్కల్లో కలిపి మీడియాకు చెప్పారా?. ఇక్కడ తేలాల్సిన అంశాలు రెండు ఉన్నాయి. హెరిటేజ్ ఫుడ్స్ స్టాక్ మార్కెట్ నియంత్రణా సంస్థలకు..స్టాక్ ఎక్స్చేంజ్ లకు తప్పుడు లెక్కలు అయినా ఇస్తూ అయినా ఉండాలి. లేదంటే చంద్రబాబు వేరే లెక్కలను ఇందులో కలిపి అయినా చెప్పి ఉండాలి.

మీడియా సాక్షిగా చెప్పిన లెక్కలపై ఆయన మాత్రమే క్లారిటీ ఇవ్వగలరు?. పోనీ హెరిటేజ్ నుంచి లోకేష్ కు నెలకు కోటి రూపాయల వేతనం వస్తుందా?.అంటే అదీ కుదరదు. మంత్రిగా ఉన్నందున రెండు చోట్ల వేతనం తీసుకుంటే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద అనర్హత వేటు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం అసలు లోకేష్ హెరిటేజ్ డైరక్టర్ గా కూడా లేరు. మరి చంద్రబాబు దొంగ లెక్కల వెనక మతలబు ఏమిటి?. చంద్రబాబు వివరణ చూస్తుంటే పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలే నిజం అన్పించేలా కన్పిస్తున్నాయనే అనుమానాలు తలెత్తటం సహజం. చంద్రబాబునాయుడు 2014లో అధికారంలోకి వచ్చాక హెరిటేజ్ ఫుడ్స్ షేరు ధరలో కూడా అసాధారణ కదలికలు వచ్చిన సంగతి తెలిసిందే.

Next Story
Share it