Telugu Gateway
Andhra Pradesh

‘నవయుగా’తో చంద్రబాబు కుమ్మక్కు!

‘నవయుగా’తో చంద్రబాబు కుమ్మక్కు!
X

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవయుగా సంస్థతో కుమ్మక్కు అయ్యారా? అంటే అవునంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. దీని వెనక బలమైన కారణాలు ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉండగా ఇదే సంస్థపై తెలుగుదేశం పార్టీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించింది. ఈ సంస్థలో ఏకంగా జగన్ కు వాటాలు ఉన్నాయని టీడీపీ నేతలు అప్పట్లో విమర్శలు చేశారు. కానీ సీన్ కట్ చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ సంస్థతో అంటకాగుతూ ప్రభుత్వ ఖజనాకు గండికొడుతున్నారని ప్రభుత్వ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. నవయుగా గ్రూపునకు చెందిన కృష్ణపట్నం ఇన్ ఫ్రాటెక్ సంస్థకు ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) కోసం అంటూ 2009లో అప్పటి కాంగ్రెస్ సర్కారు కారుచౌకగా ఐదు వేల ఎకరాలు కేటాయించింది. అసలు ఈ సెజ్ కోసం మొత్తం 12 వేల ఎకరాలు కేటాయించాలని నిర్ణయించినా..కంపెనీ పేర మాత్రం ఐదు వేల ఎకరాలు బదిలీ చేశారు. పారిశ్రామికంగా అత్యంత కీలకమైన నెల్లూరు జిల్లాలో ఈ భూమిని ఎకరా రెండు లక్షల రూపాయల లోపు ధరకు కేటాయించటం విశేషం. కృష్ణపట్నం ఇన్ ఫ్రాటెక్ ఇంత వరకూ ఒక్క ప్రాజెక్టును కూడా తీసుకు రాలేకపోయింది.

అయితే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలోనే పరిశ్రమలు ఏమీ ఏర్పాటు కాలేదనే ఉద్దేవంతో ఈ భూ కేటాయింపును రద్దు చేయటానికి రెడీ అయిపోయారు. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చి నాలుగేళ్ళు అయినా చంద్రబాబు అసలు దీనివైపే చూడటం మానేశారు. ఐదు వేల ఎకరాల్లో ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు రాకపోయినా సరే చంద్రబాబు ఏమీ మాట్లాడటం లేదంటే అర్థం చేసుకోవచ్చు దీని వెనక ఉన్న మతలబు. ఇదే నవయుగా సంస్థకు చంద్రబాబు పోలవరం ప్రాజెక్టులో 1400 కోట్ల రూపాయల పనిని నామినేషన్ పై కట్టబెట్టిన విషయం తెలిసిందే. పైకి పాత రేట్లకే అని చెబుతున్నా..దీని వెనక కూడా భారీ స్కామే ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రతిపక్షంలో ఉండగా ‘మచిలీపట్నం’ ఓడరేవు విషయంలో తెలుగుదేశం పార్టీ చేసిన యాగీ అంతా ఇంతా కాదు. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటినా ఇంత వరకూ ఈ ఓడరేవుకు సంబంధించి అడుగు ముందుకు పడలేదు. ప్రభుత్వం తరపున ఇవ్వాల్సిన భూమి కూడా ఇంత వరకూ ఇవ్వలేదు. అంతా కంపెనీ ప్లాన్ ప్రకారమే ముందుకు సాగుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

Next Story
Share it