Telugu Gateway
Andhra Pradesh

నాలుగేళ్లు ఏమీచేయలేకపోయినా.....నన్నేమీ అనొద్దు

నాలుగేళ్లు ఏమీచేయలేకపోయినా.....నన్నేమీ అనొద్దు
X

ఇదీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి తీరు. ‘నన్ను విమర్శిస్తే ఏమి వస్తుంది. నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు. అడగాల్సిన వారిని కాకుండా...నన్ను విమర్శిస్తే ఉపయోగం ఏముంటుంది. నేను బలహీనపడితే రాష్ట్రం బలహీనపడుతుంది’. ఇదీ గత కొన్ని రోజులుగా చంద్రబాబు ఉపయోగిస్తున్న వ్యూహాత్మక డైలాగులు. అంటే రాష్ట్రానికి చట్టబద్దంగా రావాల్సిన వాటిని సాధించటంలో ముఖ్యమంత్రి పాత్ర ఏమీ ఉండదా?. కేవలం మోడీదేనా బాధ్యత. కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కారు ఏపీకి అన్యాయం చేసింది అనటంలో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. మరి ఇందులో చంద్రబాబు అసలు తన పాత్రేమీలేదన్నట్లు మాట్లాడటమే విచిత్రం. నాలుగేళ్లు కేంద్రంలో అధికారంలో భాగస్వామిగా ఉండి చంద్రబాబు సాధించింది ఏమిటి?. ఫస్ట్ ప్రత్యేక హోదా లేదంటే ఓకే....ఓకే అనలేదా?. ప్యాకేజీ అనగానే రైట్ రైట్ అంటూ అర్థరాత్రి ప్రెస్ మీటి పెట్టి మరీ స్వాగతించలేదా?. చివరకు హోదా..ప్యాకేజీ రెండు లేకపోయేసరికి..కేవలం తన రాజకీయ ప్రయోజనాల కోసమే ఇప్పుడు చంద్రబాబు ఫ్లేటు ఫిరాయించలేదా?. గత ఎన్నికల ముందు మోడీ..చంద్రబాబు ఇద్దరూ కలసి కదా ఏపీ ప్రజలకు ప్రత్యేక హోదా హామీనిచ్చింది. ఇవ్వాల్సిన బాధ్యత ప్రధాని నరేంద్రమోడీపై ఎంత ఉందో? చట్టబద్దంగా రావాల్సిన హక్కును తెచ్చుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుపై కూడా అంతే ఉంది కదా?.

మరి నాలుగేళ్లు బిజెపి అడిగిన రాజ్యసభ సీట్లు..ఎమ్మెల్సీలు, ఏపీలో రెండు మంత్రి పదవులు ఇచ్చి..టీడీపీ కేంద్రంలో రెండు మంత్రి పదవులు తీసుకుని...నాకేమి బాధ్యత..తిడితే మోడీని తిట్టాలి కానీ..నన్నెందుకు తిడతారు? అంటే ప్రజలు నమ్మేస్తారా?. ఇదే చంద్రబాబు కదా విపక్షాలు విమర్శించినప్పుడు కూడా కేంద్రంతో సఖ్యతతో ఉండి అన్నీ సాధిస్తామని పదే పదే ప్రకటించింది. కేంద్రంతో గొడవ పడితే పోలవరం, అమరావతి వంటి ప్రాజెక్టులు ఆగిపోతాయని ప్రజలను అప్పట్లో భయపెట్టలేదా?. మరి ఆ భయం ఇప్పుడు ఏమి అయింది. అంటే రాజకీయ ప్రయోజనాలు దెబ్బతినే పరిస్థితి రావటంతో రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతిన్నా పర్వాలేదన్న చందంగా చంద్రబాబు ఇప్పుడు పావులు కదుపుతున్నారన్న మాట. అందుకే ఇప్పుడు ఎవరైనా మోడీని తిట్టండి...నన్ను కాదు అని కొత్త పాట అందుకున్నారు. మరి ప్రజలు చంద్రబాబు మాటలను అంత తేలిగ్గా నమ్మేస్తారా?. వేచిచూడాల్సిందే.

Next Story
Share it