Telugu Gateway
Politics

బ్యాంకు స్కామ్ లు చాలు...బిజెపిని ముంచటానికి!

బ్యాంకు స్కామ్ లు చాలు...బిజెపిని ముంచటానికి!
X

కాంగ్రెస్ కష్టపడకుండానే వచ్చే ఎన్నికల్లో గెలిచేస్తుందా?. బ్యాంకు స్కామ్ లే బిజెపిని ముంచేస్తాయా?. వరస పెట్టి చోటుచేసుకుంటున్న పరిణామాలు మాత్రం ఆ దిశగానే పయనిస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అవినీతి ఆరోపణలతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోగా..మోడీ సర్కారు మాత్రం బ్యాంకు స్కామ్ లతో సామాన్య, మధ్య తరగతి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూటకట్టుకుంటోంది. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ ల స్కామ్ లు మర్చిపోక మళ్లీ ఓ కొత్త కుంభకోణం తెరపైకి వచ్చింది. అది కూడా ఏమైనా చిన్నదా? అంటే ఏకంగా వెయ్యి కోట్ల రూపాయల స్కామ్. చెన్నయ్ కేంద్రంగా సాగిన ఈ వ్యవహారం బ్యాంకుల పట్ల ప్రజల్లో మరింత అపనమ్మకం కల్పించేలా ఉన్నాయనే చెప్పొచ్చు. ఈ సారి కుంభకోణంలో ప్రధానంగా నష్టపోయేది ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బిఐ) ఉండటం విశేషం. బ్యాంకులను సుమారు వెయ్యి కోట్ల రూపాయలకు ముంచిన కనిష్క్ గోల్డ్ జ్యుయలరీ ప్రమోటర్లు కూడా ఎంచక్కా విదేశాలకు చెక్కేశారు.

రాత్రికి రాత్రే దుకాణాలు మూసివేయడం, రికార్డులను మాయం చేయడం తదితర ఆరోపణలతో ఎస్‌బీఐ సీబీఐని ఆశ్రయించింది. ఈ స్కామ్ లో ఉన్న నిందితులు మారిషస్‌కు పారిపోయివుంటారని భావిస్తున్నారు. 824 కోట్ల రూపాయల రుణాల మోసానికి సంబంధించి కనిష్క్‌ జ్యువెలరీ యజమాని, డైరెక్టర్లు భూపేష్‌ కుమార్‌ జైన్‌, అతని భార్య నీతా జైన్‌పై ఎస్‌బీఐ సీబీఐకి ఫిర్యాదు చేసింది. మొత్తం 14 బ్యాంకుల కన్సార్టియం ఆధ్వర్యంలో కనిష్క్‌ గోల్డ్‌ జ్యుయలరీ రుణాలను దక్కించుకుంది. ఈ మొత్తం విలువ వెయ్యి కోట్లకు పైమాటే. మరోవైపు గత ఏడాది నవంబరులో రుణ ఎగవేతదారుడుగా కనిష్క్‌ గోల్డ్‌ సంస్థను బ్యాంకులు ప్రకటించాయి. 2017 సెప్టెంబరులో కనిష్క్‌ గోల్డ్ వ్యవస్థాపకుడు భూపేష్‌ కుమార్‌ జైన్‌ను రూ. 20 కోట్ల ఎక్సైజ్ పన్ను మోసం కేసులో అరెస్టు అయ్యాడు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఇప్పటివరకూ స్పందించలేదు.ఈ బ్యాంకు స్కామ్ లకు తోడు పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ కూడా బిజెపిపై వచ్చే ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

Next Story
Share it