Telugu Gateway
Andhra Pradesh

‘అసలు ఆట’ ఇప్పుడే మొదలైంది

‘అసలు ఆట’ ఇప్పుడే మొదలైంది
X

ఆంధ్రప్రదేశ్ రాజకీయం రంజుగా మారింది. అసలు ఆట ఇప్పుడే మొదలైందని చెబుతున్నారు. ఈ ఆటలో ఎవరు విజేతగా నిలుస్తారు...ఎవరు పరాజితులుగా మిగులుతారో తేలాలంటే కొంత కాలం వేచిచూడాల్సిందే. కాకపోతే ఈ మధ్య జరిగే పరిణామాలే అత్యంత కీలకంగా మారనున్నాయి. తెలుగుదేశం పార్టీ శుక్రవారం నాడు అకస్మాత్తుగా ఎన్డీయే నుంచి బయటికి వచ్చి..ఏకంగా మోడీ సర్కారుపై సొంతంగా తామే అవిశ్వాస తీర్మానం పెడుతున్నట్లు ప్రకటించింది. తొలుత వైసీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ప్రకటించి..తర్వాత మనసు మార్చుకుంది. టీడీపీ అవిశ్వాస ప్రకటనకు పలు పార్టీలు మద్దతు ప్రకటించాయి. అయితే పార్లమెంట్ సాక్షిగా ఇంత జరుగుతున్నా ప్రధాని నరేంద్రమోడీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడకపోవటం ఏపీ ప్రజలను మరింత రెచ్చగొట్టేలా ఉంది. ఈ అవిశ్వాసం నుంచి మోడీ సర్కారు బయటపడటం పెద్ద కష్టం కాకపోయినప్పటికీ ...ఢిల్లీ వేదికగా రాజకీయంగా ఒక్కసారిగా వేడెక్కటానికి కారణం అయింది. ప్రస్తుతం అందుతున్న లెక్కల ప్రకారం అవిశ్వాసానికి అనుకూలంగా సుమారు 168 మంది సభ్యులు కన్పిస్తుంటే..ఎన్డీయేకు అనుకూలంగా 333 మంది వరకూ లెక్కతేలుతున్నారు.

కాకపోతే మోడీ సర్కారును ఇరకాటంలో పెట్టేందుకు పలు పార్టీలు అవిశ్వాస అంశాన్ని ఓ అస్త్రంగా మార్చుకోవాలనే ప్లాన్ లో ఉన్నాయి. అయితే లోక్ సభలో ఆందోళనలు అగి..అసలు ఈ తీర్మానాలను టేకప్ చేస్తారా? లేదా అన్నదే ఇప్పుడు పెద్ద సస్పెన్స్ గా మారింది. అయితే నాలుగేళ్ళ పాటు ‘ప్రత్యేక హోదా’ అంశాన్ని టీడీపీ వదిలేసి..ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో మళ్ళీ ప్లేట్ ఫిరాయించింది. అయితే తనను ఎదిరించిన వారందరిని మోడీ సర్కారు ‘టార్గెట్’ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే బ్లేమ్ గేమ్ లో బిజెపిని భారీ ఎత్తున బద్నాం చేస్తున్న చంద్రబాబును మోడీ సర్కారు చూస్తూ ఊరుకుంటుందా?. లేక అస్త్రాలను బయటికీ తీస్తుందా? అన్న చర్చ ఆసక్తికరంగా మారింది. అయితే నేరుగా చంద్రబాబును టార్గెట్ చేస్తే రాజకీయం చేస్తున్నారనే విమర్శలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి...దీనికి ప్రత్యామ్నాయంగా ఇప్పటికే ప్లాన్స్ రెడీ చేసి పెట్టారని రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అందులో భాగంగానే ఓ యువనేతను టార్గెట్ చేయవచ్చని చెబుతున్నారు. ఏపీ బిజెపి నేతలు మాత్రం ఇక చూడండి..అసలు ఆట ఎలా ఉండబోతుందో అంటూ ఫుల్ జోష్ మీద ఉన్నారు.

Next Story
Share it