Telugu Gateway
Andhra Pradesh

‘కుంభకోణాల’ కేంద్రంగా చంద్రబాబు కేబినెట్

‘కుంభకోణాల’ కేంద్రంగా చంద్రబాబు కేబినెట్
X

వాళ్లంతా సీనియర్ ఐఏఎస్ అధికారులు. శాఖాధిపతులు. ప్రభుత్వాన్ని నడపటంలో కీలక పాత్ర వారిదే. ఏ ప్రభుత్వం అయిన వారి సలహాలు..సూచనలు పాటించాల్సిందే. ఎందుకంటే ఎక్కువ శాతం మంది బిజినెస్ రూల్స్ ఫాలో అవటంతోపాటు..నిబంధనలకు అనుగుణంగా ఉన్న వాటినే అమలు చేస్తారు. అందరూ అలాగే ఉంటారని చెప్పలేం. కొంత మంది తేడా కేసులూ ఉంటారనుకోండి. అయితే చంద్రబాబునాయుడి సర్కారు తన ప్రభుత్వంలోని సీనియర్ ఐఏఎస్ అధికారులు చేసిన సిఫారసులు, సూచనలను బేఖాతరు చేసి..ఇష్టానుసారం నిర్ణయాలు తీసేసుకుంటుంది. అదేంటి అంటే ‘కేబినెట్ ఆమోదం’ అనే ముసుగు. కేబినెట్ విధాన నిర్ణయాలు తీసుకోవటానికి ఉంటుందా?.లేక అక్రమాలు..స్కామ్ లను చట్టబద్దత కల్పించేందుకు ఉంటుందా?. చంద్రబాబు సర్కారు నిర్ణయాలు చూస్తుంటే అక్రమాలను సక్రమం చేసుకునేందుకు కేబినెట్ అన్న రీతిలో ముందుకు సాగుతున్నారు. ఏపీ సర్కారు కుదుర్చుకున్న సోలార్ పవర్ ఒప్పందాల వల్ల రాష్ట్ర ఖజానాపై వెయ్యి కోట్ల రూపాయల భారం పడతుందని..వద్దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్, ఇంథన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

అయినా సరే కేబినెట్ ముందు పెట్టి ప్రైవేట్ సంస్థలకు మేలు చేసేలా నిర్ణయం తీసేసుకున్నారు. ఎయిర్ పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కి దక్కిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్టును రద్దు చేయవద్దని అధికారుల కమిటీ సిఫారసు చేసింది. తాను అనుకున్న సంస్థకు టెండర్ రాకపోవటంతో చంద్రబాబు నేతృత్వంలో కేబినెట్ రద్దుకే నిర్ణయం తీసుకుంది. వైజాగ్ లో నాలుగు వంద కోట్ల రూపాయల విలువ చేసే 40 ఎకరాల భూమిని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఇన్నోవా సొల్యూషన్స్ కు ఇవ్వటానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అభ్యంతరం వ్యక్తం చేశారు. అది ప్రభుత్వం తెచ్చిన ఐటి పాలసీకి భిన్నంగా ఉందని స్పష్టం చేశారు. అయినా కేబినెట్ ముందుకే వెళ్ళింది. స్విష్ ఛాలెంజ్ పేరుతో సింగపూర్ సంస్థలకు మేలు చేసే నిర్ణయాలపై అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేసినా సర్కారు కేబినెట్ ముందు పెట్టి సింగపూర్ సంస్థలకు జై కొట్టింది. ‘మంచి ఉద్దేశం’తో తాము అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నందున తమ నిర్ణయాలపై ఎవరూ కేసులు వేయటానికి వీల్లేదంటూ ఏకంగా ఓ బిల్లు తెచ్చుందుకు రెడీ అయింది. ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యంకాదని..ఆర్థిక, న్యాయ శాఖలు స్పష్టం చేశాయి. అయినా కేబినెట్ ముందు పెట్టి ఓకే చేసేశారు.

సాగునీటి కాంట్రాక్టుల్లో జరిగిన కుంభకోణాలు మామూలు వ్యవహారాలు కాదు. అన్నీ కేబినెట్ ముసుగులో లాగించేస్తున్నారు. అమరావతిలో అయితే టెండర్ టెండర్ కో రూల్ పాటిస్తూ అస్మదీయులకు మేలు చేస్తున్నారు. నిజంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీసుకునే నిర్ణయాలు అంత ‘మంచి ఉద్దేశం’తో ఉన్నట్లు అయితే ఎందుకు ఐఏఎస్ అధికారులు వ్యతిరేకిస్తున్నట్లు?. ఆర్థిక, న్యాయ శాఖలు కూడా వ్యతిరేకిస్తున్నట్లు. కేబినెట్ ముందుకెళ్ళిన ఎన్ని నిర్ణయాలను శాఖాధిపతులు వ్యతిరేకించారు. అయినా మంత్రివర్గం ముందకెళ్లిందనే విషయంలో లెక్కలు తీస్తే చాలు...అందరూ చిక్కుల్లో పడతారని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు.

Next Story
Share it