Telugu Gateway
Andhra Pradesh

‘అమరావతి’ అందరి రాజధాని కాదు

‘అమరావతి’ అందరి రాజధాని కాదు
X

జనసేన అదినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఏపీలోని అధికార టీడీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఓ వైపు తెలుగుదేశం సర్కారు అమరావతిని పీపుల్స్ క్యాపిటల్ అని ప్రచారం చేస్తుంటే..పవన్ కళ్యాణ్ మాత్రం ఇది అందరి రాజధాని కాదు..టీడీపీ రాజధానిలా ఉందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపటం ఖాయంగా కన్పిస్తోంది. పవన్ ఓ వైపు తెలుగుదేశం, బిజెపి, వైసీపీలపై కూడా విమర్శలు గుప్పించారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం, బిజెపిలు రాష్ట్రానికి న్యాయం చేస్తాయన్న నమ్మకం తనకు లేదన్నారు. నిత్యం మాటలు మార్చేవారు..ప్రజల కోసం నిలబడలేని వారు వారికి న్యాయం ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ లపై అవినీతి కేసులు నమోదు అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న తరుణంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. చట్టం ముందు ఎవరైనా ఒకటేనని అన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కారనే విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలన్నారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాసిన లేఖపై టీడీపీ అంతగా స్పందించాల్సిన అవసరం లేదన్నారు. ఆయన ఓ పార్టీ అధ్యక్షుడే కానీ..భారత ప్రభుత్వ ప్రతినిధి కాదు కదా? అని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా అంశంపై తెలుగుదేశం పార్టీ ఎన్నోసార్లు మాటలు మార్చిందని తెలిపారు. వైసీపీ కూడా చిత్తశుద్దితో ఏమీ వ్యవహరించటం లేదన్నారు.

ప్రతి విషయంలోనూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ ధోరణితో వ్యవహరించిందే తప్ప..ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేయలేదని ఆరోపించారు. ఓ వైపు ఉత్తరాంధ్ర వంటి ప్రాంతాల్లో వెయ్యికి 50 మంది మృత్యువాత పడుతుంటే వాటి గురించి వదిలేసి పుష్కరాల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని విమర్శించారు. ఓ వైపు నిధుల లేమితో అంటూ పుష్కరాలపై ఇంత ఖర్చు చేయటం అవసరమా? అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల వారికి అమరావతిలో ఏమైనా ప్రత్యేక కేటాయింపులు ఉన్నాయా? అని ప్రశ్నించారు. నాలుగేళ్ళు బిజెపిని వెనకేసుకురావటం తప్ప..తెలుగుదేశం ప్రజలకు చేసింది ఏమీలేదని పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తరు. ఆయన సోమవారం నాడు వామపక్షాల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ 4న వామపక్షాల నేతలతో మరోసారి భేటీ కానున్నారు పవన్ కళ్యాణ్.

Next Story
Share it