Telugu Gateway
Top Stories

‘ఎయిర్ ఇండియా’ ను దక్కించుకునేది ఎవరో!

‘ఎయిర్ ఇండియా’ ను దక్కించుకునేది ఎవరో!
X

మోడీ సర్కారు ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించే ప్రక్రియను మరింత వేగవంతంగా చేసింది. ఈ సంస్థలో 76 శాతం వాటాను అమ్మకానికి పెడుతూ..ఆసక్తిగల సంస్థలను ఆహ్వానించారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎయిర్ ఇండియాను వదిలించుకునే పనిలో పడింది. ఈ సంస్థకు ఉన్న భారీ అప్పులు కూడా అందుకు కారణంగా ఉన్నాయి. లాభాల్లో ఉన్న చౌక విమాన సేవల విభాగం ఎయిరిండియా ఎక్స్‌ ప్రెస్, సింగపూర్‌కి చెందిన ఎస్‌ఏటీఎస్‌తో కలిపి ఏర్పాటు చేసిన జాయింట్‌ వెంచర్‌ సంస్థ ఏఐఏటీఎస్‌ఎల్‌లో కూడా డిజిన్వెస్ట్‌ మెంట్‌లో భాగంగానే ఉంటాయి. ఏఐఏటీఎస్‌ఎల్‌... కొన్ని మెట్రో ఎయిర్‌పోర్ట్‌ ల్లో గ్రౌండ్‌ హ్యాండ్లింగ్‌ సర్వీసులు అందిస్తోంది. ఎయిరిండియాను కొనుగోలు చేసేందుకు ప్రైవేట్‌ రంగ విమానయాన సంస్థ ఇండిగో ఇప్పటికే ఆసక్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఎయిర్‌ ఫ్రాన్స్, అమెరికాకు చెందిన డెల్టాతో కలిసి జెట్‌ ఎయిర్‌వేస్‌ కూడా బిడ్‌ చేయొచ్చన్న వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఎయిరిండియాలో వాటాల కొనుగోలు కోసం విదేశీ ఎయిర్‌లైన్స్‌ సహా వివిధ సంస్థల నుంచి పౌర విమానయాన శాఖ ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలు (ఈవోఐ) ఆహ్వానించింది. ఈవోఐలు సమర్పించడానికి మే 14 ఆఖరు తేదీ.

షార్ట్‌ లిస్ట్‌ చేసిన బిడ్డర్లకు మే 28న సమాచారమిస్తారు. ఎయిరిండియాలో వాటాలు కొనుగోలు చేసిన బిడ్డరు.. సంస్థలో కనీసం మూడేళ్ల పాటు పెట్టుబడులు కొనసాగించాల్సి ఉంటుంది. బిడ్డింగ్‌ చేసే సంస్థ నికర విలువ కనీసం రూ. 5,000 కోట్లు ఉండాలి. ఇతర సంస్థలతో కలసి కన్సార్షియంగా ఏర్పడి గానీ లేదా ఒకే సంస్థ సింగిల్‌గానైనా బిడ్డింగ్‌ వేయొచ్చు. కన్సార్షియంలో భాగమైన ప్రతీ సంస్థ.. ఈవోఐ డెడ్‌లైన్‌కి ముందు అయిదు ఆర్థిక సంవత్సరాల్లో కనీసం మూడేళ్ల పాటు లాభాలు ఆర్జించినదై ఉండాలి. అయితే, ఒకవేళ కన్సార్షియంలో సభ్యత్వం ఉన్న సంస్థ భారత్‌లో షెడ్యూల్డ్‌ ఎయిర్‌లైన్‌ ఆపరేటర్‌గా కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండి, మొత్తం కన్సార్షియం పెయిడప్‌ ఈక్విటీ షేరు క్యాపిటల్‌లో వాటా గరిష్టంగా 51 శాతానికి మించకుండా ఉంటే.. ఈ నిబంధన వర్తించదు.

Next Story
Share it