Telugu Gateway
Politics

అందరి చూపు టీడీపీ నిర్ణయం వైపు!

అందరి చూపు టీడీపీ నిర్ణయం వైపు!
X

తెలుగుదేశం పార్టీ అడుగులు ఎటువైపు?. బిజెపికి రాం రాం చెప్పటమా? మరికొంత కాలం వేచిచూసే ధోరణి అవలంభించటమా?. ఇప్పుడు అందరి చూపు టీడీపీ వైపే. ఓ వైపు ఏ మాత్రం పట్టించుకోని కేంద్రం..మరో వైపు బడ్జెట్ లోనూ కనీస సాయం కరవు. కేంద్ర, రాష్ట్రాల్లో భాగస్వామిగా ఉండి..ప్రజలకు ఎలా సమాధానం చెప్పుకోవటం?. ఇది టీడీపీ నేతల అంతర్మథనం. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొదలుకుని పలువురు మంత్రులు కేంద్ర బడ్జెట్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేసేందుకు ఆదివారం నాడు ఎంపీలతో సమావేశం కానున్నారు. అంత కంటే ముందే అంటే శుక్రవారం నాడు జరిగే మంత్రివర్గ సమావేశంలోనూ ఈ అంశంపై చర్చించనున్నారు. అసలు టీడీపీ ఈ విషయంలో ఎలా ముందు అడుగు వేస్తుందనేది అందరిలో ఆసక్తి నెలకొంది. పోలవరం మొదలుకుని పలు విషయాల్లో ఏపీ సర్కారు కోరుకున్న దానికి కేంద్రం వ్యవహరించేదానికి ఏ మాత్రం సంబంధం లేకుండా ఉంటోంది. ఈ తరుణంలో బిజెపి, టీడీపీల మధ్య అంతంత మాత్రంగా ఉన్న సంబంధాలపై బడ్జెట్ మరో పిడుగువేసినట్లు అయింది. ఎంపీ దివాకర్ రెడ్డిలాంటి వారు అయితే బిజెపి నేతలు తమకు పొమ్మనలేక పొగపెడుతున్నారనే వ్యాఖ్యలు చేశారు.

ఏపీకి అన్యాయం చేసిన కేంద్రంపై నిరసన తెలపడమా, ఒత్తిడి తేవడమా అనే దానిపై త్వరలో నిర్ణయిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఏపీకి 16వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్‌ ఉన్నప్పటికీ దానిని కేంద్ర బడ్జెట్‌లో పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ఏపీలో ప్రధానాంశాలైన పోలవరం ప్రాజెక్ట్, అమరావతి రాజధాని, రైల్వేజోన్‌ అంశాలను బడ్జెట్‌లో ప్రస్తావించకపోవడం, ఏపీ విభజన చట్టం అంశాలను పరిగణనలోకి తీసుకోకపోవడం సరికాదన్నారు. ఏపీకి కేటాయింపులపై మోదీ పునరాలోచించుకోవాలని సూచించారు. బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపై ముఖ్యమంత్రి, పార్టీ పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మరో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా బడ్జెట్ అన్యాయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం నాటి సమావేశంలో తీవ్ర నిర్ణయాలు ఉంటాయనే సంకేతాలు ఇస్తున్నారు.

Next Story
Share it