Telugu Gateway
Politics

టీడీపీ లీకులకు..వీర్రాజు డైరక్ట్ క్లారిటీ

టీడీపీ లీకులకు..వీర్రాజు డైరక్ట్ క్లారిటీ
X

టీడీపీది లీకుల రాజకీయం. అమరావతిలో టీడీపీపీ సమావేశం ప్రారంభం కాగానే బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా..ఫోన్ చేశారు. రాజ్ నాధ్ ఫోన్ చేశారు. తొందరపడొద్దని కోరారు. మాట్లాడదామని చెప్పారు. ఇవీ లీకుల సారాంశం. అసలు ఆ ఫోన్లో నిజమో కాదో..ఎవరికీ తెలియదు. ఇప్పుడు టీడీపీ లీకులు ఇఛ్చి మీడియాలో ఓ కొత్త వార్త రాయించింది. ఏపీ సీఎం చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలు చేసినందుకు ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారని ఆ వార్తల సారాంశం. దానికి సోము వీర్రాజు డైరక్ట్ ఎటాక్ ఇచ్చేశారు. ‘నన్ను అమిత్‌ షా మందలించారన్న వార్తల్లో వాస్తవం లేదు. కొన్ని పత్రికలు కొందరికి మేలు చేసేందుకు అవాస్తవాలు రాస్తున్నాయి. కావాలంటే నా కాల్‌డేటాను పరిశీలించుకోవచ్చు. కర్నూలు సభలో నేను చేసిన రెండెకరాలు...లక్షకోట్లు వ్యాఖ్యలు ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించినవి కావు. నన్ను వైఎస్‌ఆర్‌ సీపీ కోవర్టు అంటూంటే నవ్వొస్తోంది. ఇక పవన్‌ కల్యాణ్‌ జేఏసీ ఏర్పాటు మంచిదే. రాష్ట్రంలో అనిశ్చితికి ఫుల్‌స్టాప్‌‌ పెట్టమని కోరుతున్నా.

కొందరు నా గొంతు నొక్కేందుకు కుట్ర చేస్తున్నారు. ఏపీకి అన్యాయం చేసిన కాంగ్రెస్‌తో కలిసి టీడీపీ నేతలు ఉద్యమిస్తారా?. ప్రజలకు ఎలాంటి సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నారు. ప్రజలను అయోమయానికి గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొంతమంది నన్ను అణచాలని చూస్తున్నారు. అది సాధ్యం కాదు. నా ఊపిరి ఉన్నంతవరకూ జాతీయవాద రాజకీయాల గురించే మాట్లాడతా. బడ్జెట్‌ కాపీలు నాలుగు రోజుల ముందే మంత్రులకు వెళతాయి. మరి వాటిని కేంద్రమంత్రులు అశోక్‌ గజపతిరాజు, సుజనా చౌదరి చూడలేదా?. ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి త్రికరణశుద్ధితో పని చేస్తున్నాం.’ అని తెలిపారు. అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారో లేదో తెలియదు కానీ..రెండు ఎకరాలు లక్ష కోట్ల విషయంలో మాత్రం వీర్రాజు వెనక్కితగ్గినట్లే కన్పిస్తోంది. మరి ఈ పని ఎందుకు చేశారో? అవి చంద్రబాబు ఉద్దేశించి కాకపోతే ఎవరిని ఉద్దేశించినవి. వైఎస్ సీఎంగా ఉన్న సమయం నుంచి చంద్రబాబుపై ప్రత్యర్థులు చేసే ప్రధాన ఆరోపణ అదే..రెండు ఎకరాల చంద్రబాబు వేల కోట్లు ఎలా సంపాదించారని?. అది చంద్రబాబును కాదంటే ఎవరైనా నమ్ముతారా?. ఇప్పుడు వీర్రాజు క్లారిఫికేషన్ కొత్త అనుమానాలకు తావిచ్చేదిలా మారింది.

Next Story
Share it