Telugu Gateway
Politics

చంద్రబాబూ...ఇప్పుడు యూటర్న్ ఎందుకు!

చంద్రబాబూ...ఇప్పుడు యూటర్న్ ఎందుకు!
X

నిధులు సాధించటంలో తానే నెంబర్ వన్ అని ప్రకటించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పుడు యూ టర్న్ ఎందుకు తీసుకున్నారని బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రశ్నించారు. దేశంలో ఎవరూ సాధించనంత తానే సాధించానని చంద్రబాబు స్వయంగా ప్రకటించుకున్నారని తెలిపారు. ఇప్పుడు మళ్లీ ఎందుకు మాట మార్చాల్సి వచ్చిందని ప్రశ్నించారు. వెనకబడిన జిల్లాల అభివృద్ధి కోసం కేంద్రం ఇచ్చిన నిధులతో ఇప్పటివరకూ ఆయా జిల్లాల్లో ఎన్ని పరిశ్రమలు ఏర్పాటు చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. విభజన హామీల అమలుకు 2022 వరకూ గడువు ఉందని వ్యాఖ్యానించారు. మిత్రపక్షంగా ఉంటూ తమపై బురదజల్లే ప్రయత్నం తగదన్నారు. రాష్ట్రంలో తాము ఎదుగుతామని భయం టీడీపీకి పట్టుకుందని ఆరోపించారు. పొత్తు వద్దని తామెప్పుడూ చెప్పలేదని అన్నారు. ఎవరో సంఘాలు పెట్టినంత మాత్రాన తమకేమీకాదని పవన్ కళ్యాణ్ కొత్తగా ఏర్పాటు చేసిన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీనుద్దేశించి వ్యాఖ్యానించారు.

కేంద్రం ఎన్నో నిధులు ఇస్తున్నా..మోడీ, బిజెపిని అన్ పాపులర్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం ఇవ్వాల్సింది అంతా ఇచ్చేసిందని తెలిపారు. కేంద్రం ఇంకా ఏమి బాకీ ఉందో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పాలని కోరారు. అమరావతికి ఇచ్చిన 1600 కోట్ల రూపాయలను ఏమి చేశారని సోము వీర్రాజు ప్రశ్నించారు. ఎంపీల రాజీనామా వైసీపీ, టీడీపీల డ్రామా అని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రణాళికను ఏ మేరకు అమలు చేసిందో తాను పవన్ కళ్యాణ్ ను అడుగుతా అని సోము వీర్రాజు తెలిపారు. అందరి కంటే ఎక్కువ సాధించానని చెప్పిన చంద్రబాబు, కేంద్రాన్ని ఇంత కంటే ఎక్కువ అడగలేమని సుజనా చౌదరి ప్రకటించారని..ఇఫ్పుడు ఎందుకు ఇద్దరూ మాట మారుస్తున్నారని అన్నారు.

Next Story
Share it