Telugu Gateway
Andhra Pradesh

ఏపీకి కాంగ్రెస్ బంపర్ ఆఫర్

ఏపీకి కాంగ్రెస్ బంపర్ ఆఫర్
X

ఆంధ్రప్రదేశ్ కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఏపీలో రాజకీయం అంతా ప్రస్తుతం ‘ప్రత్యేక హోదా’ చుట్టూనే తిరుగుతోంది. ఇంత కాలం ప్రత్యేక హోదా నినాదాన్ని పూర్తిగా వదిలేసిన అధికార టీడీపీ..మళ్ళీ ఇప్పుడు మాట మార్చి హోదా బాటలో పయనిస్తోంది. హోదాకు సమానమైన ప్యాకేజీ ఇస్తామంటే అంగీకరించామని..తమకు ప్రత్యేక హోదా అయినా ఇవ్వాలి..లేదంటే హోదాకు సమానమైన ప్యాకేజీ అయినా ఇవ్వాలి అంటూ అటూ ఇటుకాకుండా మాట్లాడుతోంది. అటు కేంద్రం, ఇటు ఏపీలో అధికారంలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, బిజెపిలు బ్లేమ్ గేమ్ ఆడుతున్నాయి. మీ వల్లే నష్టం జరిగింది అంటే మీ వల్లే నష్టం జరిగింది అని ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. ఈ తరుణంలో కాంగ్రెస్ ఓ ఆఫర్ తో ముందుకొచ్చింది. 2019లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యాక మొదటి సంతకం ప్రత్యేక హోదా ఫైల్ పైనే పెడతారని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి చెప్పారు.

విభజన హామీలు, ప్రత్యేక హోదా సాధన కోసం అన్ని రాజకీయ పార్టీలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నాలుగేళ్లలో ఒక్క విభజన హామీ కూడా నెరవేర్చలేదని రఘువీరారెడ్డి ఆరోపించారు. విభజన హామీల అమలు కోసం కాంగ్రెస్ పార్టీ మొదటినుంచి పోరాడుతూనే ఉందని చెప్పారు. చట్టసవరణ చేసైనా రాష్ట్రానికి నిధులు కేటాయించాలని, దీనికి కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతుందన్నారు. పార్లమెంట్‌లో విభజన హామీలపై చర్చ జరపకుంటే చరిత్ర హీనులవుతారని ధ్వజమెత్తారు. మరి రఘువీరారెడ్డి హామీ అమలు కావాలంటే ఏపీ ప్రజలందరూ కాంగ్రెస్ కు ఓట్లు వేసి ఆ పార్టీ ఎంపీలను గెలిపించాలన్న మాట.

Next Story
Share it